Tuesday, 3 November 2026

రెండు రాష్ట్రాల ఏర్పాటు మొదలైంది


ఉద్యోగులను పంచేందుకు కమిటీలు
రాజ్యాంగబద్ధంగానే తెలంగాణ : జైరామ్‌ రమేశ్‌
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 (జనంసాక్షి) :
తెలంగాణ, అవశేష ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియ మొదలైందని కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు జైరామ్‌ రమేశ్‌ తెలిపారు. ఆంధప్రదేశ్‌ విభజన పక్రియ మొదలైందని, ఇందుకోసం రెండు కమిటీలు ఏర్పాటు చేశామని ఆయన
పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ ప్రక్రియ గురించి వివరించారు. ఆలిండియా సర్వీసు అధికారుల పంపిణీ కోసం ఒక కమిటీ, రాష్ట్రస్థాయి అధికారుల కోసం మరో కమిటీ వేసినట్లు ఆయన చెప్పారు. సీమాంధ్ర రాజధాని నిర్ణయం కోసం నిపుణుల కమిటీ ఒకదాన్ని నియమిస్తామని, రాజధాని ఎక్కడ ఉండాలో ఆరు నెలల్లోగా ఆ కమిటీ నిర్ణయిస్తుందని తెలిపారు. అయితే, ఇంతకుముందు 45 రోజుల్లోగా కొత్త రాజధాని ఎక్కడో చెబుతామన్నా.. దాన్ని సవరించి ఆరు నెలలుగా చేసినట్లు ఆయన చెప్పారు. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను తిరిగి సీమాంధ్రలో కలుపుతామని, అయితే బూర్గంపాడు మండలంలోని ఆరు గ్రామాలు మాత్రం తెలంగాణలోనే ఉంటాయని ఆయన చెప్పారు. ఇందుకోసం త్వరలోనే కేంద్రం ఆర్డినెన్స్‌ తెస్తుందన్నారు. పోలవరం నిర్మాణం బాధ్యతను కేంద్రమే తీసుకుంటుందని అన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన విసయాన్ని ఆయన రాజ్యసభలో కూడా వెల్లడించారు. హైదరాబాద్‌లో గవర్నర్‌కు శాంతిభద్రతల అప్పగింత అంశంపై రాజ్యాంగబద్ధంగానే వెళ్లామని జైరామ్‌ రమేశ్‌ అన్నారు. ఉభయసభల్లోనూ ఆమోదం పొందిన బిల్లు గెజెట్‌ కోసం రాష్ట్రపతి వద్దకు వెళ్తుందన్నారు. అప్పాయింటెడ్‌ డే ప్రకటన తర్వాత కొత్త రాష్ట్రం అధికారికంగా ఏర్పాటవుతుందని, అపాయింటెడ్‌ డే ఇచ్చిన తేదీ నుంచి మూడు నెలల్లో ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌ ఏర్పడ్డాయని ఆయన తెలిపారు. అపాయింటెడ్‌ డే నుంచి రెండు రాష్ట్రాలకూ ఇద్దరు సీఎంలు, ఇద్దరు సీఎస్‌లు, ఇద్దరు డీజీపీలు ఉంటారని ఆయన తెలిపారు. సీమాంధ్ర ఆర్థిక ప్రణాళిక అమలు కోసం ప్లానింగ్‌ కమిషన్‌లో ప్రత్యేక కమిటీ వేశామని, అది వచ్చే వారం నుంచి పని చేస్తుందని జైరాం రమేష్‌ అన్నారు. నాలుగైదు రోజుల్లో రాష్ట్ర ఏర్పాటుపై గెజిట్‌ విడుదలవుతుందని, తెలంగాణ రాష్ట్ర అవతరణ తేదీని అందులోనే పొందుపరుస్తామని అన్నారు. మొత్తం రాష్ట్రంలో ఉన్న 84 వేల మంది ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు పంచాల్సి ఉందన్నారు. తెలంగాణ, సీమాంధ్రకు ఉద్యోగాల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఐఏఎస్‌ అధికారులు.. దాదాపు రాష్ట్ర స్థాయి 84 వేల మంది ఉద్యోగుల కేటాయింపునకు రెండు కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సీమాంధ్రలో అభివృద్ధి, నిధుల కేటాయింపునకు డిప్యూటీ చైర్మన్‌ నేతృత్వంలో ప్లానింగ్‌ కమిషన్‌లో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ బిల్లును పూర్తి రాజ్యంగబద్ధంగా రూపొందించామన్నారు. గవర్నర్‌ కు లా అండ్‌ ఆర్డర్‌ కొత్తకాదని తెలిపారు. సుప్రీం తీర్పుల ప్రకారమే వ్యవహరించామని పేర్కొన్నారు. సీమాంధ్రకు న్యాయం జరిగేలా చూశామన్నారు. విద్య, ఉద్యోగాలు, సాగునీటి విషయంలో సీమాంధ్రకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. సీమాంధ్రులకు విద్యావకాశాలు పదేళ్ల వరకు ఉంటాయన్నారు. ఆర్థిక సాయంలోనూ సీమాంధ్రులకు చాలా మేలు జరిగిందన్నారు. సీమాంధ్రకు ఐదేళ్ల పాటు ప్రత్యేక ¬దా ఉంటుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకొని అభివృద్ధి సాధించాలని కోరారు. బిల్లు త్వరలో రాష్ట్రపతికి వెళుతుంది. ఆ తర్వాత గెజిట్‌ విడుదల అవుతుంది. గెజిట్‌ విడుదల తేదీ నుంచి కొత్త రాష్ట్రం ఆవిర్భవించినట్టేనని తెలిపారు. ఇక తెలంగాణలో పదేళ్ల పాటు అడ్మిషన్ల విధానం మారదని, ఇప్పుడు ఉన్నట్లే ఉంటుందని ఆయన వివరించారు. రెండు ప్రాంతాలు నేతలు కలహాలు మాని పరస్పరం సహకరించుకోవాలని జైరామ్‌ రమేశ్‌ సూచించారు. రాయలసీమలో నాలుగు జిల్లాలకు, ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఉంటుందని ఆయన చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *