Monday, 2 November 2026

కిరణ్‌ రాజీనామా ఆమోదం


కేంద్రానికి గవర్నర్‌ నివేదిక
రాష్ట్రపతి పాలనవైపే ఢిల్లీ మొగ్గు
హైదరాబాద్‌, ఫిబ్రవరి 21 (జనంసాక్షి) :
ముఖ్యమంత్రి పదవికి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన రాజీనామాను శుక్రవారం గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదించారు. బుధవారం కిరణ్‌ తన పదవికి రాజీనామా చేసిన విషయం విధితమే. కొత్త సీఎం ఎంపిక జరిగే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్‌ ఆయనను కోరారని సమాచారం. లోక్‌సభలో టి.బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో కిరణ్‌ తన పదవికి రాజీనామా సమర్పించిన సంగతి తెలిసిందే. రాజీనామాకు గవర్నర్‌ నరసింహన్‌ శక్రవారం ఉదయం ఆమోద ముద్ర వేశారు. సీఎం రాజీనామా అంశాన్ని ప్రత్యేక దూత ద్వారా కేంద్రానికి నివేదించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పదవిలో కొనసాగాలని గవర్నర్‌ నరసింహన్‌ కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరినట్టు రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్‌ విభజన ప్రక్రియ మరో వారం రోజుల్లో పూర్తయి రెండు రాష్ట్రాలు ఏర్పడనుండటంతో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఉత్కంఠగా మారింది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రపతి పాలనకే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. అయితే రాష్ట్రానికి చెందిన పార్టీ వర్గాలు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో పూర్తి మెజార్టీ ఉండగా రాష్ట్రపతి పాలన విధిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అధిష్టానానికి నచ్చజెప్పే పనిలో పడ్డారు. రెండు రాష్ట్రాల ఏర్పాటు తర్వాత కొత్త ప్రభుత్వాల ఏర్పాటుకే చొరవ చూపాలని అధిష్టానం పెద్దలను పలువురు నేతలు శుక్రవారం కోరారు. మరోవైపు కిరణ్‌ మూడేళ్ల రెండు నెలల 25 రోజులపాటు పాటు సీఎం పదవిలో కొనసాగాడు. రాష్ట్ర విభజనకు సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి అధిష్టానంతో విభేదిస్తూ వచ్చారు. రాష్ట్ర పునర్విభజన బిల్లును తిరస్కరిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయించారు. లోక్‌సభలో ఈనెల 18న బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందిన మరుసటిరోజునే అంటే ఈనెల 19న గవర్నర్‌కి రాజీనామా సమర్పించారు. కిరణ్‌ రాజీనామా తర్వాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలా, లేదా మరో మంత్రి మండలి ఏర్పాటు చేయాలా.. అన్న అంశంపై కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే లోక్‌సభ, రాజ్యసభల్లో పునర్విభజన బిల్లు ఆమోదం పొందడం, రాష్ట్రపతి ఆమోదముద్ర తర్వాత నేరుగా గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడిన దగ్గర నుంచి రెండు రాష్ట్రాల ఏర్పాటు జరగడం వంటి అంశాలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటోంది. మరో వారంలోనే సార్వత్రిక ఎన్నికల ప్రకటన వెలువడుతుందని భావిస్తున్న తరుణంలో కేంద్రం తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. ఒకట్రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ¬ం మంత్రి షిండే చెప్పడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే కిరణ్‌ రాజీనామా తర్వాత రాష్ట్రంలో నెలకొని ఉన్న అనిశ్చితిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. రాష్ట్రపతి పాలన తప్పదని ప్రచారం జరుగుతున్నా ఇప్పటివరకు కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయంలో గవర్నర్‌ నరసింహన్‌ ఇచ్చిన నివేదికను ¬ం శాఖ పరిశీలించి ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు సిఎం కుర్చీ కోసం ఎవరికి వారు ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆమోదమేనంటూనే కాంగ్రెస్‌లో ఇరు ప్రాంతాల నేతలు తమవంతుగా పైరవీలు మొదలు పెట్టారు. మరోవైపు కొందరు నేతలు గవర్నర్‌ను గురువారమే కలిశారు. మర్యాదపూర్వకంగానే కలిసినా కేంద్రానికి నివేదిక పంపే సమయంలో జాగ్రత్తలపై పరిశీలన కోసం కలిశారని తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నేతృత్వంలో పలువురు మంత్రులు గవర్నర్‌ను కలిసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించొద్దని, తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని వారు గవర్నర్ను కోరినట్లు సమాచారం. తాము గవర్నర్‌ను మర్యాదపూర్వకంగానే కలిశామన్నారు. ధన్యవాదాలు తెలిపేందుకే కలిశామని, ఎలాంటి రాజకీయ విషయాలు చర్చించలేదని ఆనం చెప్పటం విశేషం. రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌ ఏ నిర్ణయం తీసుకున్నా తమకు సమ్మతమేనన్నారు. ఇదిలావుంటే సీఎం రాజీనామాతో ఒక్కటైన ఆయన వ్యతిరేక వర్గం లాబీయింగ్‌ జోరు పెంచింది. గవర్నర్‌ నరసింహన్‌ను బొత్స, ఆనం, దానం, కన్నా, రఘువీరాలు కలిశారు. ధన్యవాదాలు తెలిపేందుకు గవర్నర్‌ ను కలిశామని, రాజకీయ అంశాలు మాట్లాడలేదని వారు పేర్కొన్నారు. అయితే తమను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని వీరు కోరినట్లు సమాచారం. మరోవైపు తాజాగా ఢిల్లీలో కూడా ఇరుప్రాంతాల నేతలు దిగ్విజయ్‌ను, సోనియాను కలిశారు. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటయ్యేలా చూడాలని, గవర్నర్‌ పాలన వద్దని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *