
సన్యాసి లగడపాటి సహా ఆరుగురి ఎంపీలే హాజరు
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (జనంసాక్షి) :
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డికి ఆదరణ కరువైంది. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన కిరణ్ కొత్త పార్టీ ఏర్పాటుకు చేస్తున్న సన్నాహాలకు ఆదిలోనే ఆదరణ లేకుండా పోయింది. ఆదివారం తన నివాసంలో నిర్వహించిన భేటీకి రాజకీయ సన్యాసం ప్రకటించిన లగడపాటి రాజగోపాల్ సహా, కాంగ్రెస్ పార్టీ బహిష్కరణ వేటు పడిన ఎంపీలు రాయపాటి సాంబశివరావు, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్‌కుమార్, హర్షకుమార్, సాయిప్రతాప్‌తో పాటు మాజీ మంత్రి శైలజానాథ్, కాసు వెంకటకృష్ణారెడ్డి మాత్రమే హాజరయ్యారు. రేపో.. ఎల్లుండో.. పార్టీ ఏర్పాటుపై ఆపద్దర్మ సీఎం కిరణ్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఎంపీలు తెలిపారు. మాదాపూర్‌లో ఆదివారం ఉదయం కిరణ్‌తో సమావేశం అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. భవిష్యత్తు కార్యాచరణ, పార్టీ ఏర్పాటు, ప్రస్తుత రాజకీయ పరిస్థితి.. తీసుకోవాల్సిన నిర్ణయాలు తదితర అంశాలపై మాట్లాడారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపి రాష్ట్రంలో ఉనికిని కోల్పోయాయని చెప్పారు. మరో 10 రోజుల్లో ఏ పార్టీకి ఓటు వేయాలన్న విషయంపై ప్రజలకు స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో మరో పార్టీ రావాల్సిన అవసరం ఉందని తెలియజేశాం. అందరం సహకరిస్తామని చెప్పాం. అయితే సోమవారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నట్టు తెలిపారు. ఆ తర్వాత తాము కూడా కలిసి చర్చలు జరుపుతా మని.. ఆ తర్వాత అంటే సోమవారం రాత్రికిగాని, మంగళవారం ఉదయానికి గాని పార్టీ ఏర్పాటుపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. తక్కువ సమయం ఉన్నప్పటికీ.. కొత్త పార్టీ కావాలని ప్రజలు కోరుకుంటున్నందున తక్కువ సమయం ఉన్నా సరిపోతుందని అన్నారు. మరో ఎంపి హర్షకుమార్ మాట్లాడుతూ పార్టీ ఏర్పాటు చేయాల్సిన సమయం వచ్చింది. కొత్త పార్టీని ఏర్పాటు చేయాల్సిందేనని చెప్పాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చివరికంటా పోరాడాం. తమ శాయశక్తులా కృషి చేశామని వెల్లడించారు.
కిరణ్ కొత్త పార్టీకి ఆదరణ కరువు




