Tuesday, 3 November 2026

సాంకేతిక సాయంతో

సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహిస్తాం
రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు లేవు
డీజీపీ ప్రసాద్‌రావు
కరీంనగర్‌ క్రైం, ఫిబ్రవరి 23 (జనంసాక్షి) :
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహిస్తామని డీజీపీ ప్రసాద్‌రావు అన్నారు. రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు లేవని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తెలంగాణ ఉద్యమంలో నమోదైన కేసులను ఎత్తివేస్తామని ఆయన తెలిపారు. కరీంనగర్‌ జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం పట్టణంలోని పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లోని ఉమేశ్‌చంద్ర సమావేశ మందిరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని నేతలు ఒత్తిడి చేస్తే ప్రభుత్వం స్పందిస్తుందన్నారు. తెలంగాణ బిల్లు పెట్టిన సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని భావించినప్పటికీ ఇరువర్గాల ప్రజలు సంయమనం పాటించి పోలీసులకు సహకరించడం అభినందనీయమన్నారు. నక్సల్స్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడితే నక్సల్స్‌ ప్రాబల్యం పెరుగుతుందని అనుకోవడం లేదని, ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కరీంనగర్‌ జిల్లా చాలా అభివృద్ధి చెందిందని, పశ్చిమ గోదావరికి దీటుగా జిల్లాలో వరి సాగు చేస్తున్నారని, ఎన్టీపీసీ, బొగ్గు నిక్షేపాలుండడంతో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రాబోయే ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని, సమస్యాత్మక ప్రాంతాలకు అదనపు బలగాలను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఓటు హక్కును పద్ధతిగా వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం ఇదివరకే సీసీ, వెబ్‌ కెమెరాలతో పోలింగ్‌ కేంద్రాలను పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. 1994కు ముందు నక్సల్స్‌ చేతిలో నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం వచ్చేలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. పోలీసులు సివిల్‌ కేసుల్లో తలదూర్చితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. కానీ గ్రామాల్లో వీటిని పరిశీలించి కేసులు నమోదు చేస్తున్నారని, దీనిపై హైకోర్టు కూడా ఆదేశించినట్లు గుర్తుచేశారు. సామాన్య పౌరుడు పోలీసుస్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు ఇచ్చేలా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో వరంగల్‌ రేంజ్‌ ఐజీ రవిగుప్త, కరీంనగర్‌ రేంజ్‌ డీఐజీ ఆర్‌బీ నాయక్‌, ఎస్పీ వి.శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *