ఏడు వినతులతో పత్రం
సోనియాను కలిసిన కేసీఆర్ కుటుంబం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23 (జనంసాక్షి) :
సోనియాగాంధీ వల్లే తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల కల సాకారమైందని టీఆర్‌ఎస్ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆదివారం తన కుటుంబ సభ్యులతో సహా టెన్ జన్‌పథ్‌కు వెళ్లిన కేసీఆర్ సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియాగాంధీ తెలంగాణను ఏర్పాటు చేశారని కేసీఆర్ కొనియాడారు. అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. సోనియాకు కృతజ్ఞతలు తెలిపాం.. ఆమె దీవెనలు ఇచ్చారని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు 10 జన్‌పథ్‌లోని సోనియాగాంధీ నివాసానికి కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యులు చేరుకున్నారు. తెలంగాణ ప్రజల కల సాకారం చేసినందుకుగాను సోనియాకు ధన్యవాదాలు తెలియజేశాం. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంపై ఒక నోట్ ఇచ్చానన్నారు. తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ, ఎయిమ్స్, ఐఐఎంల ఏర్పాటు, ఎన్‌టీపీసీ నుంచి 500 మెగావాట్ల విద్యుత్ కేటాయింపు, నేదునూర్, శంకరంపల్లి గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలకు గ్యాస్ కేటాయింపు సహా ఏడు అంశాలతో కూడిన నోట్‌ను అందజేసినట్టు తెలిపారు. అదే నోట్‌ను ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు అందజేయనున్నట్టు చెప్పారు. అంతకుమించి ఒక్క మాట కూడా సోనియాగాంధీతో మాట్లాడలేదన్నారు. టీఆర్‌ఎస్ పొత్తు, విలీనం తదితర అంశాలపై దిగ్విజయ్‌సింగ్‌తో మాట్లాడాలని సూచించారు. మరో రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటా. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తానని అన్నారు. అలాగే రాష్ట్రపతి ప్రణబ్‌ను కూడా కలవ నున్నట్టు వెల్లడించారు. సోనియా వల్లే తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కల ఫలించిందని అన్నారు. ఆమె పట్టుదల వల్లే లోక్‌సభ, రాజ్యసభల్లో బిల్లు ఆమోదం పొందిందని అన్నారు. తెలంగాణ ప్రజలు ఆమెకు రుణపడి ఉంటారని తెలిపారు. ఇదిలా ఉండగా కేసీఆర్‌తో పాటు కవిత, కె.తారకరామారావు, హరీష్‌రావు మొత్తం 12మంది కుటుంబ సభ్యులు సోనియాను కలిసి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కేసీఆర్ దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ అయ్యారు.
సోనియా వల్లే తెలంగాణ





