Tuesday, 3 November 2026

అవినీతి వ్యతిరేక పోరాటానికి కట్టుబడ్డాం

బిల్లుల స్థానంలో ఆర్డినెన్స్‌
నాడు రాజీవ్‌ కంప్యూటర్లంటే.. భాజపా ఎద్దేవా చేసింది
నేడు సాంకేతిక విద్య గురించి మాట్లాడుతోంది : రాహుల్‌
డెహ్రాబూన్‌, ఫిబ్రవరి 23 (జనంసాక్షి) :
అవినీతి వ్యతిరేక పోరాటానికి కట్టుబడ్డామని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలిపారు. మతహింస వ్యతిరేక బిల్లుతో పాటు పార్లమెంట్‌ ఆమోదం పొందలేకపోయిన పలు బిల్లుల స్థానంలో ఆర్డినెన్స్‌లు తీసుకువస్తామని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోమారు బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ రకంగానైనా అధికారంలోకి రావాలన్న వ్యామోహంతో బీజేపీ నెత్తుటి రాజకీయాలకు పాల్పడుతుందని దుయ్యబట్టారు. ర్యాలీలో భాగంగా ఆయన డెహ్రాబూన్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన సభలో బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ నెత్తుటి రాజకీయాలు చేస్తోంది. ఎలాగైనా అధికారంలోకి వచ్చేయాలన్న ఆలోచన తప్ప వాళ్ల కంటికి మరొకటి కనిపించడంలేదు. అధికారంలోకి రావడానికి అవసరం అనుకుంటే ఒక మతంపైకి మరో మతాన్ని, ఒక కులంపైకి మరో కులాన్ని ఉసిగొల్పి రక్తం కళ్లచూడ్డానికి కూడా వెనుకాడరు అని రాహుల్‌ విమర్శించారు. అదే కాంగ్రెస్‌ అయితే ప్రజల బాదలను అర్థం చేసుకుని వారి కోసం కృషి చేస్తుందన్నారు. ఆదివారం కొన్ని సార్లు ప్రజల ఆకాంక్షలకు తగినట్లుగా తమ పాలన ఉండకపోవచ్చని, అయితే దేశం అభివృద్ధి పథంలో పయనించాలంటే దానికి అవసరమైన దూరదృష్టి కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని చెప్పారు. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో కంప్యూటర్ల గురించి మాట్లాడితే ఎద్దేవా చేసిన బీజేపీ ఇప్పుడు సాంకేతిక విద్య గురించి మాట్లాడుతోందని అన్నారు. ఆ పార్టీ దూరదృష్టి ఏపాటిదో ఇది రుజువు చేస్తుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *