Monday, 2 November 2026

చిరంజీవే సీమాంధ్ర సీఎం?


అభిప్రాయాలు సేకరిస్తున్న దిగ్విజయ్‌సింగ్‌
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 (జనంసాక్షి) :
తెలంగాణలో పార్టీ పరిస్థితి విభజన తరవాత మెరుగ్గా ఉండగలదని భావిస్తున్న తరుణంలో సీమాంధ్రలో వచ్చే ఎన్నికల్లో పార్టీని గట్టెక్కించుకునే పనిలో కాంగ్రెస్‌ పడింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో గవర్నర్‌ పాలన పెట్టకుండా ఓ ఛరిష్టా కలిగిన నేతను సిఎంగా చేసి ముందుకు నడవాలని చూస్తోంది. ఇందుకు చిరంజీవి సరైన అభ్యర్థిగా భావిస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా సాగితే తదుపరి ముఖ్యమంత్రిగా ఒకటి రెండురోజుల్లో చిరంజీవి ప్రమాణం చేస్తారని ఢిల్లీలో పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఉమ్మడి ఆంధప్రదేశ్‌ రాష్టాన్రికి కేంద్ర మంత్రి చిరంజీవి కానున్నారని సమచారం. ఏ బాధ్యతలు అప్పచెప్పినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి చిరంజీవి ప్రకటించడంతో ఆయనపై వస్తున్న వార్తలకు బలం చేకూర్చినట్లవుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీనితో సీఎం పదవిని భర్తీ చేయాలని అధిష్టానం ఆలోచిస్తోంది. సీఎం పదవి చిరంజీవికి కట్టబెడుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు దిగ్విజయ్‌ సింగ్‌ తో చిరంజీవి భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ . పార్టీకి పునరుత్తేజం కల్పించేందుకు ఏ బాధ్యతలు అప్పచెప్పినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. పార్టీ ప్రచారం, భవిష్యత్‌ వ్యూహాలను దిగ్విజయ్‌ చిరంజీవికి వివరించినట్లు సమాచారం. చిరుకు బాధ్తయలపై డిగ్గీ రాజా ఇతర ప్రాంత నాయకుల అభిప్రాయలను కూడా తీసుకుంటున్నారు. గవర్నర్‌ పాలన లేకుండా ఎవరు సిఎం అయినా తమకు అబ్యంతరం లేదని మంత్రి డికె అరుణ అన్నారు. పిసిసి చీఫ్‌ బొత్స కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. దీంతో రాష్ట్ర విభజన పక్రియను జెట్‌ స్పీడ్‌ తో పూర్తి చేసిన కాంగ్రెస్‌ ఉమ్మడి ఆంధప్రదేశ్‌ చిట్ట చివరి సీఎంను నియమించే పనిలో నిమగ్నమైంది. రాష్ట్రపతి పాలన విధించాలని ముందుగా అనుకున్నా దానిని పక్కకు పెట్టాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. సీమాంధ్రలో బలహీనమైన కాంగ్రెస్‌ ప్రతిష్టతను మరింత పెంచుకోవాలని ఆలోచిస్తోంది. సీఎం పదవికి, అటు- పార్టీ ప్రతిష్టతను పెంచాలంటే సమర్థవంతమైన నాయకుడు కావాలని..చిరంజీవికి ఆ లక్షణాలున్నాయని అధిష్టానం యోచిస్తున్నట్లు- కథనాలు వస్తున్నాయి. చిరంజీవితో పాటు- పిసిసి అధ్యక్షుడు బొత్స, మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు- సమాచారం. వీరంతా కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడం..వీరిలో ఒకరిని సీఎంగా నియమిస్తే కాపు సామాజిక వర్గం సానుభూతిని పొందవచ్చని కాంగ్రెస్‌ వ్యూహంగా కనిపిస్తోంది. కిరణ్‌ రాజీనామా చేసినా చిరంజీవి ఉన్నారని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఇటీవలే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దిగ్విజయ్‌ సింగ్‌ తో చిరంజీవి మంగళవారం ఉదయం భేటీ- కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఇప్పుడు టిఆర్‌ఎస్‌ బలం కూడా కలసి వచ్చే అంశం. మరోవైపు ఎంఐఎం కూడా కలసిరాగలదని భావిస్తున్నారు. ఈ దశలో చిరును తీసుకుని వస్తే అదనంగా లాభం చేకూరగలదని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *