Monday, 2 November 2026

జలాంతర్గాముల ప్రమాదాలకు నైతిక బాధ్యతతోనే జోషి రాజీనామా

రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) :
జలాంతర్గాముల వరుస ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూనే నేవీ చీఫ్‌ జోషి తన పదవికి రాజీనామా చేశారని భారత రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ తెలిపారు. ముంబై తీరానికి 50 కిలోమీటర్ల దూరంలో పరీక్షలు నిర్వహిస్తున్న సింధురత్న జలంతార్గామిలో బుధవారం ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గల్లంతైన ఇద్దరు నావికాదళ అధికారులు మృతిచెందారు. గత ఏడు నెలల్లో నావికదళ నౌకల్లో ఏడు ప్రమాదాలు జరిగాయి. సింధురత్న జలాంతర్గామి ప్రమాదం సహా, ఇటీవల జరిగిన ప్రమాదాలపై నావికాదళం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. ముంబయి తీరంలో సింధురత్న జలాంతర్గామిలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు సిబ్బంది గల్లంతవ్వగా, ఏడుగురు గాయపడిన విషయం తెలిసిందే. దీంతో నౌకాదళాధిపతి డీకే జోషీ రాజీనామా చేశారు. అయితే ఇది చాలా విచారకరమని రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ వ్యాఖ్యానించారు. తన రాజీనామాను త్వరగా ఆమోదించాలని జోషీ కోరినట్టు ఆంటోనీ గురువారం మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. సింధురత్న జలాంతర్గామి ప్రమాదం తర్వాత చాలా మంది నౌకా దళాధికారులు రాజీనామాలకు సిద్ధపడుతున్నట్టు పేర్కొన్నారు. జోషికి మరో 15 నెలల సర్వీసు ఉంది. ఐఎన్‌ఎస్‌ సింధురత్న ప్రమాదం చోటుచేసుకున్న గంటల వ్యవధిలోనే ఆయన రాజీనామా సమర్పించారు. రాజీనామాను వెంటనే అంగీకరించిన రక్షణ మంత్రి.. వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ నావల్‌ స్టాఫ్‌ అడ్మిరల్‌ ఆర్కే ధోవాన్‌ను తాత్కాలిక బాధ్యతలు తీసుకోవాలంటూ ఆదేశాలిచ్చారు. తాజా సంఘటన వివరాలను రక్షణమంత్రి ఏకే ఆంటోనీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి వివరించారు. నావికా దళాధిపతి వివాదాస్పద రీతిలో పదవి నుంచి వైదొలగడం గత పదిహేనేళ్లలో ఇదే తొలిసారి. ఎన్డీఏ హయాంలో అడ్మిరల్‌ విష్ణుభగవత్‌ను తొలగించారు. జోషి తర్వాత నావికాదళ చీప్‌ అయ్యే అవకాశం ఉన్న వారి జాబితాలో తూర్పు నావికాదళ కమాండర్‌ వైస్‌ అడ్మిరల్‌ అనిల్‌చోప్రా ముందు వరుసలో ఉన్నారు. తాత్కాలిక చీఫ్‌ అడ్మిరల్‌ ధోవాన్‌తో పాటు అనిల్‌ను, పశ్చిమ నావికాదళ కమాండర్‌ వైస్‌ అడ్మిరల్‌ శేఖర్‌ సిన్హాలను కూడా ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *