
టీ జేఏసీ చైర్మన్ కోదండరామ్
హైదరాబాద్, ఫిబ్రవరి 28 (జనంసాక్షి) :
పోలవరం పేర తెలంగాణలోని ఆదివాసీ, గిరిజన గూడాల్ని ముంచడాన్ని తాము ఒప్పుకోబోమని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపాలనే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని కోదండరామ్ తెలిపారు. కేంద్రం ప్రయత్నాలను అడ్డుకోవాలని ఆయన తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. దీనివల్ల గిరిజన గూడేలు పూర్తిగా మునిగి పోతాయని, వారు నిరాశ్రయులవుతారని అన్నారు. తాము పోలవరానికి వ్యతిరేకం కాదని అయితే ప్రస్తుత డిజైన్ మారిస్తేనే ముంపు ప్రాంతాలను రక్షించవచ్చన్నారు. పోలవరం ముంపు ప్రాంతాలలో భద్రచలం రెవెన్యూ గ్రామం మినహా పలు గ్రామాలను సీమాంధ్రలో కలిపేందుకు కేంద్రం సూత్రపాయంగా అంగీకరించింది. అయితే తమను తెలంగాణలోనే ఉంచాలని అయా గ్రామాల ప్రజలు ఇటీవల ఆందోళనలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో భద్రాచలం సీమాంధ్రలో కలపాలని ఆ ప్రాంత కేంద్ర మంత్రులు చేసిన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. సీమాంధ్ర కేంద్ర మంత్రుల ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించ వద్దంటూ తెలంగాణ ప్రాంతానికి చెందిన పలు పార్టీలు నేతలు కేంద్రంపై ఒత్తిడి చేశారు. దాంతో పోలవరం ముంపునకు గురయ్యే కొన్ని గ్రామాలను మాత్రం సీమాంధ్రలో కలిపేందుకు కేంద్రం అంగీకరించింది.
పోలవరం పేర ముంచడాన్ని ఒప్పుకోం




