Monday, 2 November 2026

తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వాలి


పారిశ్రామిక సదస్సులో గీతారెడ్డి
హైదరాబాద్‌, ఫిబ్రవరి 28 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలని మాజీ మంత్రి జె. గీతారెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తిపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అయితే తెలంగాణకు కూడా ప్రత్యేక ప్రతిపత్తి కావాలని మాజీ మంత్రులు గీతారెడ్డి, ప్రసాద్‌, పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యుడు వివేక్‌ తదితరులు కోరారు. నగరంలో ఫాప్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన పారిశ్రామిక సదస్సులో వారు పాల్గొని మాట్లాడారు. అధిష్టానం అన్నీ ఆలోచించే రాష్ట్రపతి పాలనపై నిర్ణయం తీసుకుందని భావిస్తున్నట్లు గీతారెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన నిర్ణయం సముచితమని మాజీ మంత్రి అభిప్రాయపడ్డారు. మరో 3, 4 రోజుల్లో ఎన్నికల ప్రకటన రానున్న తరుణంలో ప్రభుత్వ ఏర్పాటు అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లి ప్రజల మన్ననలు పొందుతామన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ఎంచుకునే కొత్త మార్గమేమిటో తెలిశాక స్పందిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనివార్యమైందని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం అన్నారు. విభజన పక్రియ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి రెండు రాష్ట్రాల్లో ప్రజాపాలన ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా హైదరాబాద్‌ బ్రాండ్‌ను కాపాడుతామని ఈ ప్రాంత నేతలు తెలిపారు. తెలంగాణలో పారిశ్రామిక రంగాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే అంశంపై పలువురు సూచనలు చేశారు. పరిశ్రమల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై పారిశ్రామికవేత్తలు గీతారెడ్డికి వినతిపత్రం అందించారు. పారిశ్రామిక వేత్తల సదస్సులో జేఏసీ చైర్మన్‌ కోదండరాం ప్రసంగించారు. తెలంగాణ పారిశ్రామికవేత్తలు స్వయంశక్తితో పైకోచ్చారని తెలిపారు. నైపుణ్యం కలిగిన పారిశ్రామికులు మనకు కొదువలేదన్నారు. పారిశ్రామిక ఏరియాలను సమగ్రాభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. నాణ్యమైన కరెంట్‌ అందించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉందన్నారు. వివిధ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యాలు పెంచాలన్నారు. పారిశ్రామికాభివృద్ధిపై పార్టీలు ప్రజల్లో విశ్వాసం పెంచాలన్నారు. సీమాంధ్రకు ప్రత్యేక ¬దా ఇచ్చారు కాబట్టి మని జాగ్రత్తగా ఉండాలన్నారు. తెలంగాణ పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలన్నారు. ఫ్యాప్సీ భవన్‌లో తెలంగాణ పారిశ్రామికవేత్తల సదస్సు జరిగింది. ఈ సదస్సులో పెద్దపల్లి ఎంపీ వివేక్‌ మాట్లాడుతూ బ్రాండ్‌ హైదరాబాద్‌ను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అందరూ 20 శాతం ఎక్కువ కష్టపడాలని చెప్పారు. మన వనరులను కాపాడుకుంటునే అభివృద్ధిని సాధించాలని తెలిపారు. విభజనతో రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *