పోలీసులే యముళ్లు
రాహుల్‌తో రిక్షా కార్మికులు ఏకరువు
వారణాసి, మార్చి 1 (జనంసాక్షి) :
‘మా కష్టాలు ఏం చెప్పమంటావ్ బిడ్డా! పోలీసోల్లు మాకు యముళ్లు’ అంటూ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి రిక్షా కార్మికులు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎదుట తమ సమస్యలు ఏకరువు పెట్టుకున్నారు. శనివారం వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా శనివారం రెండో రోజు ఆయన లక్నో నుంచి హెలిక్యాప్టర్లో వారణాసికి వెళ్లారు. కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఆయన అక్కడి వీధుల్లో రోడ్డుకిరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకెళ్లాడు. ఈ సందర్భంగా కాన్వాయ్ ఆపిన ఆయన రిక్షా కార్మికులతో గంటన్నరపాటు ముఖాముఖి మాట్లాడారు. వారి ఆరోగ్య, బీమా సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీసుల వల్ల తాము ఎదుర్కొంటున్న వేధింపులు, సమస్యలపై రాహుల్‌కు ఏకరువుపెట్టారు. అసంఘటిత రంగానికి అందజేసే సామాజిక పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. దారిద్య్ర రేఖ దిగువన జీవించే పేద కుటుంబాలకు బీమా, ఆరోగ్య ప్రయోజనాలను కల్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరతానని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ఆస్కార్ ఫెర్నాండేజ్ అన్నారు. వారివెంట కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ మిస్త్రీ తదితరులు ఉన్నారు.
ఏం చెప్పమంటావ్ బిడ్డా!





