Tuesday, 3 November 2026

తెలంగాణాతో సొంతూరుకు కోదండరామ్‌

ఈ విజయం అమరులదే
ఉప్పొంగిన గ్రామస్థులు
బెల్లంపల్లి, మార్చి 3 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రసాధన కోసం రాజకీయ శక్తులను ఏకతాటిపై తెచ్చి పోరాడి, రాష్ట్రం సిద్ధించిన వేళ టీ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం ఆయన స్వగ్రామానికి చేరుకున్నారు. తెలంగాణతో గ్రామానికి వచ్చిన కోదండరాంను చూసి గ్రామస్థులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. సోమవారం నాడు ఆయన స్వగ్రామం ఆదిలాబాద్‌ జిల్లాలోని జోగాపూర్‌కు చేరుకోగానే గ్రామస్తులు ఎదురేగి ఉద్యమసారథికి ఘనస్వాగతం పలికారు. ఈ విజయం తెలంగాణ ప్రజలదని, తెలంగాణ కోసం అన్ని శక్తులు ఎదురొడ్డి పోరాడాయని అమరుల త్యాగఫలితమే స్వరాష్ట్రం సిద్ధించిందన్నారు. పునర్నిర్మానంలో జేఏసీ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. పోలవరంలో ఆదివాసుల్ని ముంచి, ముంపు గ్రామాల్ని అవశేష ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మళ్లించడాన్ని ఆయన తప్పుబట్టారు. దీనికి వ్యతిరేకంగా మరో ఉద్యమం చేస్తామన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులు పోరాటంలో చూపిన తెగువ, త్యాగాలను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 1200 మంది విద్యార్థులు ఆత్మబలిదానలు చేసుకున్నారని, వారి ఆత్మ నేటితో శాంతించిందన్నారు. ఓయూ విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారన్నారు. కేంద్రం ప్రభుత్వాన్ని ఒప్పించిన తీరు రాష్ట్ర చరిత్రలో చిరస్మరణీయంగా మిగిలిపోనుందని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు కోదండరాంకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశం లో టీఆర్‌ఎస్‌ నాయకులు చిన్నయ్య, ఇబ్రహిం, తెలంగాణవాదులు, గ్రామస్థు లు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *