Tuesday, 3 November 2026

నేనే అడ్డా? అయితే రాజీనామా చేస్తా


దళితుడు సీఎం అన్న ముచ్చటేమైంది?
విలీనంపై విజయశాంతి సవాల్‌
హైదరాబాద్‌, మార్చి 4 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్‌ పార్టీలో విలీనం కావడానికి తానే అడ్డమయితే రాజీనామా చేసేందుకు సిద్ధమని మెదక్‌ ఎంపీ విజయశాంతి అన్నారు. తనవల్లే విలీనం ఆగిపోయిందన్నది నిజమైతే తాను కాంగ్రెస్‌కు రాజీనామా చేయడానికి సిద్ధమని విజయశాంతి అన్నారు. తాను కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తే టిఆర్‌ఎస్‌ను విలీనం చేస్తారా అని సవాల్‌ చేశారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పింది టీఆర్‌ఎస్‌ నేతలేనని, నాయకులు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు మాటమార్చి పార్టీని విలీనం ఏయనని చెప్పడం సరైంది కాదన్నారు. టిఆర్‌ఎస్‌లో తనను ఇబ్బందిపెట్టారని, షోకాజ్‌ నోటీసు ఇవ్వకుండానే పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారని ఆమె అన్నారు.ఎందుకు సస్పెండ్‌ చేశారో కూడా తనకు తెలియదన్నారు. తెలంగాణ ప్రజల కోసమే తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని, అధిష్టానం అప్పగించిన బాధ్యతలు నిర్వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని విజయశాంతి చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకున్నారని విజయశాంతి అన్నారు. ఇవాళ ఆమె విూడియా సమావేశంలో మాట్లాడారు. 25 ఎంపీ సీట్లను వదులుకుని తెలంగాణ ప్రజల కోసం ఆమె తెలంగాణను ఇచ్చారని తెలిపారు. తెలంగాణ ఏర్పడగానే తాను సోనియా వద్దకు వెళ్లి ధన్యావాదాలు తెలిపానన్నారు. టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. వెంటనే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయాలన్నారు. తెలంగాణ ఇచ్చాక టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామన్నది వాళ్లే ఇవ్వమంటున్నది వాళ్లేనని కేసీఆర్‌ను పరోక్షంగా ఉద్దేశించి అన్నారు. తెలంగాణ ఇచ్చినందుకు సోనియాను తెలంగాణ తల్లి అని పొగడలేదా? అని ప్రశ్నించారు. ఇపుడు తనను చేర్చుకున్నందుకు టీఆర్‌ఎస్‌ను విలీనం చేయమంటున్నారని విమర్శించారు. అసలు నాకు విలీనానికి సంబంధంలేదు. నన్ను టీఆర్‌ఎస్‌ నుంచి జులైలో సస్పెండ్‌ చేశారు. నేను చాలా కాలం నిశ్శబ్దంగా ఉండి మొన్న కాంగ్రెస్‌లో చేరాను. పోనీ నేను కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తాను. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తారా? అని ప్రశ్నించాన్నారు. ఇవన్నీ కావాలని చేస్తున్నవే తప్ప మరోటి కాదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *