
శ్రీధర్‌బాబు, షబ్బీర్ అలీ
హైదరాబాద్, మార్చి 4 (జనంసాక్షి) :
టీఆర్‌ఎస్ తమ పార్టీలో విలీనం కాకపోతే కాంగ్రెస్‌కే లాభమని మాజీ మంత్రులు శ్రీధర్‌బాబు, షబ్బీర్ అలీ అన్నారు. టీఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనంపై వెనకడుగు వేయడంతో భవిష్యత్ కార్యాచరణపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు దృష్టి సారించారు. మాజీమంత్రి జానారెడ్డి నివాసంలో వీరంతా సమావేశమై తదుపరి చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఇతర పార్టీలపై కాంగ్రెస్ ఆధారపడదని అభిప్రాయపడ్డారు. టీఆర్‌ఎస్ తో పొత్తు గానీ, విలీనం గానీ ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఏనాడు ఆశించలేదన్నారు. ఇతర పార్టీలపై ఆధారపడే అవసరం కాంగ్రెస్ కు ఎప్పుడూ ఉండదన్నారు. జానారెడ్డి నివాసంలో సుదర్శన్ రెడ్డి, శ్రీధర్ బాబు, షబ్బీర్ ఆలీలు మంగళవారం సమావేశమైయ్యారు. అనంతరం టీఆర్‌ఎస్ పొత్తు, విలీనం చర్చలకు సంబంధించి శ్రీధర్‌బాబు, షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన ఘనత ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీదేనని తెలిపారు. ఉద్యమ స్పూర్తితో పాటు కాంగ్రెస్ కృషి వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తరవాత తాము కూడా సంతృప్తిగా లేమన్నారు.తమకు కూడా అనేక అనుమానాలు , అసంతృప్తులు ఉన్నాయన్నారు. గవర్నర్‌కు అధికారలు, పోలవరం ముంపు ప్రాంతాల బదలాయింపు తదితర అంశాలపై ఇప్పటికీ రాజీ పడలేదన్నారు. అయితే చట్టసభలో బిల్లు ప్రవేశపెట్టి తెలంగాణ తెచ్చిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని శ్రీధర్‌బాబు అన్నారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. టీ-ఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ను పిట్టల దొరగా అభివర్ణించారు. ఆయన ఏనాడు నిజాలు చెప్పలేదన్నారు. విలీనం కుదరదన్న తమకు టీఆర్‌ఎస్ తో పొత్తు కూడా అవసరం లేదన్నారు. విలీన అంశంపై హైకమాండ్‌కు, కేసీఆర్ కు మధ్య జరిగిన సంభాషణను అవసరమొచ్చినప్పుడు బయటపెడతామన్నారు. కాంగ్రెస్ పార్టీలో టీఆర్‌ఎస్ విలీనం లేదన్నందుకు కేసీఆర్‌కు ధన్యవాదాలు చెబుతున్నామని అన్నారు. తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్ పార్టీని సోనియా గాంధీ కాళ్లు దగ్గర పెడతానన్న కేసీఆర్ ఇప్పుడు పిట్టల దొరలా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఇవ్వటానికి కాంగ్రెస్, సోనియా ఎన్ని కష్టాలు పడ్డారో అందరికీ తెలుసునన్నారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎన్ని సీట్లు గెలుచుకుందో అందరికీ తెలుసునన్నారు. పార్లమెంట్లో తెలంగాణ గురించి కేసీఆర్ ఒక్కమాట అయినా మాట్లాడారా అని షబ్బీర్ అలీ సూటిగా ప్రశ్నించారు. అంత దూరం నుంచే అమ్మా అంటూ దండాలు పెట్టుకుంటూ కేసీఆర్ కుటుంబం సోనియా గాంధీ వద్దకు ఎందుకు వెళ్లారని ఆయన అన్నారు. తెలంగాణ ఇచ్చినందుకు తాము ప్రభుత్వాన్ని కోల్పోయామని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. రేపోమాపో తెలంగాణ పీసీసీ రానున్నదని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో 119 స్థానాలు గెలుచుకుంటామని షబ్బీర్ అలీ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రావడంలో కేసీఆర్ పాత్రేమీ లేదన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు ఎంఐఎం నేత అసదుద్దీన్ సవరణలు ఇచ్చారని, కేసీఆర్ నోరు కూడా మెదపలేదని విమర్శించారు. ఉద్యమం చేసిన వారంతా ఒకటి కావాలనే ఉద్దేశంతోనే కేసీఆర్‌ను విలీనం అడిగామని షబ్బీర్ అలీ వివరించారు.
విలీనం కాకపోతే కాంగ్రెస్‌కే లాభం




