Tuesday, 3 November 2026

తెలంగాణ మాదే : డీఎస్‌


హైదరాబాద్‌, మార్చి 5 (జనంసాక్షి) :
తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీయే అధికారంలోకి వస్తుందని పీసీసీ మాజీ చీఫ్‌ డి. శ్రీనివాస్‌ తెలిపారు. సీమాంధ్రలోనూ తమ పార్టీ విజయం సాధిస్తుందని అన్నారు. బుధవారం నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్‌ మాట్లాడారు. పొత్తులతో సంబంధం లేకుండా తాము సొంతంగానే తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ గెలుస్తుందన్న ధీమా కార్యకర్తల్లో ఉందన్నారు. కొంతమంది నేతల్లో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే అయినా విభజనకు బాధపడాల్సిన అవసరం లేదన్నారు. సీమాంధ్ర అభివద్ధికి కూడా కాంగ్రెస్‌ చర్యలు తీసుకుందని, పదేళ్లలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే కాంగ్రెస్‌కు శ్రీరామరక్ష అని ఆయన పేర్కొన్నారు. సీమాంధ్రకు ఇస్తున్న ప్యాకేజీలు తదితర అంశాలు అక్కడ విజయానికి దోహదపడతాయని అన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీదే అధికారమని శ్రీనివాస్‌ ధీమా వ్యక్తే చేశారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని అన్నారు. సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు. కేవలం సోనియాగాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని డీఎస్‌ మరోమారు స్పష్టం చేశారు. తెలంగాణ ఇచ్చేందుకు ఎంత శ్రమించాల్సి వచ్చిందో సోనియాకే తెలుసు. తెలంగాణ కోసం పోరాడిన వాళ్లను తప్పకుండా ప్రజలు గౌరవిస్తారు. ప్రజల్లో పరపతి ఉండి, గెలవగలిగే అభ్యర్థులు మాకు కావాలి. తెలంగాణ జేఏసీ నేతలు కూడా అర్హులైతే ఎన్నికల్లో పోటీ చేయవచ్చన్నారు. అమరవీరుల కుటుంబాల్లో ఉన్నవాళ్లు ఎన్నికల్లో పోటీకి ముందుకొస్తే పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *