Tuesday, 3 November 2026

ఉద్యోగుల పంపకాలు షురూ


పని ప్రారంభించిన కమల్‌నాథ్‌ బృందం
హైదరాబాద్‌, మార్చి 6 (జనంసాక్షి) :
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల పంపకాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర విభజన పూర్తి అయిన నేపథ్యంలో ఇరు ప్రాంతాలకు ప్రభుత్వ ఉద్యోగులను పంపిణీ చేసేందుకు ఏర్పాటైన కమల్‌నాథన్‌ కమిటీ గురువారం నగరానికి చేరుకుంది. కేంద్ర సహాయకార్యదర్శి అర్చనా వర్మ, ఎస్సార్సీ డైరెక్టర్‌ కిప్‌ జాన్‌, ఎస్‌ నాయక్‌, ప్రతాప్‌ ఈ కమిటీ సభ్యులుగా ఉన్నారు. మధ్యాహ్నం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, వివిధ శాఖల అధికారులతో కమిటీ సభ్యులు సమావేశం అయ్యారు. ఉద్యోగులకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన నేపథ్యంలో కేవలం ఉద్యోగుల విభజనపై ఈ కమిటీ విధివిధానాలను ఖరారు చేయనున్నారు. ఉద్యోగుల విభజన, విధివిధానాలపై వారు చర్చించారు. విభజన నేపథ్యంలో సచివాలయంలోకి అనుమతి లేని వ్యక్తులు రాకూడదని నోటీసులు జారీ చేశారు. అధికారులు ఎవరూ దస్త్రాలను తమ ఇళ్లకు తీసుకెళ్లకూడదని నోటీసుల్లో పేర్కొన్నారు.రాష్ట్ర విభజన జరిగిన దృష్ట్యా సచివాలయంలో ఆంక్షలు విధించారు. అనధికారికంగా ఎవరినీ అనుమతించొద్దంటూ జీవో జారీ చేశారు. సచివాలయంలోని సెక్షన్లు, ఆఫీసుల నుంచి ఫైళ్లను అనుమతి లేకుండా తీసుకెళ్లడాన్ని నిలిపివేయాలంటూ ఉత్తర్వూలు జారీ అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *