Tuesday, 3 November 2026

జెడ్పీ రిజర్వేషన్లు ఖరారు

జిల్లా    రిజర్వేషన్‌

రంగారెడ్డి    జనరల్‌

నల్గొండ    ఎస్టీ

మహబూబ్‌నగర్‌    ఎస్సీ

వరంగల్‌    ఎస్సీ (మహిళ)

ఖమ్మం    ఎస్సీ (మహిళ)

నిజామాబాద్‌    బీసీ

కరీంనగర్‌    బీసీ (మహిళ)

ఆదిలాబాద్‌    బీసీ (మహిళ)

మెదక్‌    బీసీ (మహిళ)

హైదరాబాద్‌, మార్చి 8 (జనంసాక్షి) :

జిల్లా పరిషత్‌ ఎన్నికల రిజర్వేషన్లను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ శనివారం ఖరారు చేసింది. ఈసారి మహిళలకు ఎక్కువ జిల్లా పరిషత్‌లను కేటాయంచడం విశేషం. సుప్రీం ఆదేశాలతో ఎన్నికలకు సిద్దమవుతున్న ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రకటించింది. ఇప్పటికే జడ్‌పిటిసి, ఎంపిటీసిల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఇక సోమవారం ఎన్నకకుసంబంధించి నోటిఫికేషన్‌ వెలువడనుంది. సీమాంధ్రలో నాలుగు జడ్పీలను జనరల్‌గా కేటాయించారు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు, ప్రకాశంజిల్లాల జడ్పీల్లో ఎలాంటి రిజర్వేషన్లు లేకుండా జనరల్‌కు కేటాయించారు. విజయనగరం జిల్లా పరిషత్‌ను ఎస్టీ మహిళకు ప్రకటించారు. అనూహ్యంగా కడప ఎస్సీ మహిళకు కేటాయించారు. విశాఖపట్టణం, శ్రీకాకుళం, కృష్ణా, చిత్తూరు జడ్పీలను కూడా మహిళలకురిజర్వ చేశారు. అయితే ఇది జనరల్‌ మహిళ కింద ఉంటుంది. గుంటూరు కూడా బిసి మహిళకు కేటాయించారు. మొత్తం 13 జడ్పీలలో రిజర్వేషన్లతో కలిపి మొత్తం 7స్థానాలను మహిళా ఛైర్‌పర్సన్లకు కేటాయించారు. ఇక తెలంగాలో ఒక్క రంగారెడ్డి మాత్రమే జనరల్‌ కింద పరిగణించారు. నల్లగొండ ఎస్టీలకు, మహబూబ్‌నగర్‌-ఎస్సీలకు కేటాయించారు. వరంగల్‌, ఖమ్మంజడ్పీలనను ఎస్సీ మహిళలకు కేటాయించారు. అలాగే ఆదిలాబాద్‌, మెదక్‌, కరీంనగర్‌ జడ్పీలను బీసీ మహిళలకు రిజర్వ్‌ చేశారు. మొత్తంగా తెలంగాణలో కూడా ఐదు స్థానాలు మహిళలకు ప్రత్యేకించారు. మొత్తం 23 జిల్లాల్లో హైదరాబాద్‌ మినహాయిస్తే 22 జిల్లాల్లో వివిధ కేటగిరీలతో పాటు మొత్తం 12 మహిళలకు కేటాయించారు.  దీంతో 12 జడ్పీల్లో మహిళా అభ్యర్థులు చైర్‌పర్సన్‌లు కానున్నారు. ఇదిలావుంటే సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏప్రిల్‌ 6వ తేదీన పంచాయతీరాజ్‌ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఈ నెల 9వ తేదీ ఆదివారం ఎంపీటీసీ, జెడ్పీటీ-సీ ఎన్నికలతోపాటు-, జెడ్పీ చైర్‌పర్సన్‌, ఎంపీపీ చైర్‌పర్సన్ల ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌/నోటిఫికేషన్‌ విడుదల చేయడానికి రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ పి.రమాకాంత్‌రెడ్డి  పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ వరప్రసాద్‌ తదితర అధికారులతో సమావేశమే షెడ్యూల్‌కు సంబంధించి ఇప్పటికే చర్చించారు. ఈ మేరకు రిజర్వేషన్లు కూడా ఖరారు చేశారు.జిల్లాల్లో కలెక్టర్లు ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడంతో పాటు- గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు.. రిజర్వేషన్లు రొటేషన్‌ పద్ధతిలో ఉంటాయని కూడా చెప్పారు. పంచాయతీరాజ్‌ అధికారులు ఇచ్చే రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని అధికారవర్గాల సమాచారం. పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు సీరియస్‌గా ఉన్న నేపథ్యంలో.. 10వ తరగతి, ఇంటర్‌ పరీక్షల దృష్ట్యా ఎన్నికల నిర్వహణకు ఏప్రిల్‌ 6 (ఆదివారం) అనువైన తేదీగా ఎన్నికల సంఘం భావిస్తున్నట్టు తెలిసింది. పరీక్షల ఇబ్బందుల దృష్ట్యానే మున్సిపల్‌ ఎన్నికలను సైతం మార్చి 30న (ఆదివారం) నిర్వహిస్తున్న విషయం విదితమే. పంచాయతీ ఎన్నికల్లో ఎలక్టాన్రిక్‌ ఓటింగ్‌ మిషిన్లు (ఈవీఎంలు) ఉపయోగించేందుకు అవకాశం లేదు. అందువల్ల బ్యాలెట్‌ పేపర్లనే వినియోగించనున్నారు. పంచాయతీ ఎన్నికలకు చాలా అధిక సంఖ్యలో ఈవీఎంలు అవసరమవుతారు?. అంత భారీ సంఖ్యలో ఈవీఎంలు ప్రస్తుతం అందుబాటులో లేవు. పైగా మున్సిపల్‌, సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలనే వినియోగిస్తున్నందున సాంకేతిక కారణాల దృష్ట్యా కూడా వీటిని పంచాయతీ ఎన్నికల్లో ఉపయోగించే వీల్లేదని సమాచారం.  మరోవైపు బ్యాలెట్‌ బాక్సుల కొరతను దృష్టిలో ఉంచుకుని పొరుగు రాష్ట్రాల నుంచి వీటిని తెప్పించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జెడ్పీ చైర్‌పర్సన్లు, మండల పరిషత్‌ చైర్‌పర్సన్ల రిజర్వేషన్లు రాష్ట్రం యూనిట్‌గా నిర్ణయిస్తారు. రాజ్యాంగం ప్రకారం జనాభా ఆధారంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు.   ఇక అన్నింటిలోనూ తొలిసారిగా మహిళలకు 50శాతం  సీట్లు రిజర్వ్‌ చేయనున్నారు.  మండల పరిషత్‌ చైర్‌పర్సన్ల రిజర్వేషన్లు రాష్ట్రం యూనిట్‌గా నిర్ణయించినా, ఏ మండలం ఎవరికి రిజర్వ్‌ అవుతుందన్న విషయాన్ని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ నిర్ణయించకుండా.. ఆయా జిల్లాల జనాభా లెక్కల ఆధారంగా సంఖ్యను మాత్రమే ఖరారు చేసి జిల్లాలకు పంపిస్తారు. ఆయా జిల్లాలకు కేటాయించిన సంఖ్యతో ఆయా జిల్లాలోని జనాభా ఆధారంగా కలెక్టర్లు మండల రిజర్వేషన్లు ఖరారు చేస్తారని  వివరించారు. ఈ నెల 10వ తేదీ నాటికి తాజా ఓటర్ల జాబితాలను ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా  ప్రచురించాలని  ఎన్నికల సంఘం అన్ని జిల్లాల పంచాయతీ అధికారులు, జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారులను ఆదేశించింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తాజాగా ప్రచురించిన ఫోటోలున్న ఓటర్ల జాబితాను వినియోగించుకుని ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా ఓటర్ల జాబితా ప్రచురించాలని ఆదేశించారు. మున్సిపల్‌ ఎన్నికలకు 48 గంటల ముందు మద్యం దుకాణాలను మూసేయాలని ఆదేశిస్తూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సవిూర్‌శర్మ  ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలు జరిగే 146 మున్సిపాలిటీలు, పది మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఈ నిబంధనలు వర్తింప చేయాలని పేర్కొన్నారు. ఇలావుండగా ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు ఏ రాజకీయ పార్టీకి చెందిన గుర్తింపు చిహ్నాలు వాడడానికి వీల్లేదని తెలిపారు. వాహనాలపైనే కాకుండా ఇంటిపైన, ఆస్తులకు సంబంధించిన వాటిలో పార్టీలతో ప్రమేయం కానీ, వాటి చిహ్నాలు కానీ ఉంచరాదని స్పష్టం చేశారు. కేవలం ఓటు హక్కు వినియోగించుకోవడం మినహా మరే విధంగానూ తమ విధానాన్ని బయట పెట్టడానికి వీల్లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఏ రాజకీయ పార్టీ లేదా అభ్యర్థికి ఎన్నికల ఏజెంట్‌గా వ్యవహరిస్తే మూడు నెలల జైలు శిక్ష, జరిమానా విధిస్తారని హెచ్చరించారు. మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, అసెంబ్లీ, లోక్‌సభ… ఇలా ఒకేసారి అన్ని స్థాయులకు సంబంధించిన ఎన్నికలు జరగడం మన రాష్ట్రంలో ఇదే ప్రథమం. సాధారణంగా ఎంతో కొంత సమయం తర్వాతే ఈ ఎన్నికలన్నీ జరుగుతుంటాయి. అయితే వివిధ కారణాల వల్ల మున్సిపాలిటీ, స్థానిక ఎన్నికలు వాయిదా పడుతూ రావడంతో  ఇప్పుడు కోర్టు ఆదేశాలతో వాటిని కూడా దాదాపుగా సార్వత్రిక ఎన్నికలకు కొంచెం అటూ ఇటూగా నిర్వహించాల్సి వస్తోంది. దీంతో రాజకీయ పార్టీలన్ని తలమునకలు అవుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ అయితే సీమాంద్ర ప్రాంతంలో పోటీ చేయించడానికి తగిన అభ్యర్థులు కూడా దొరక్క తల పట్టుకుంటోంది. రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం కాంగ్రెస్‌ పార్టీయేనన్న విషయం సామాన్య ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమైంది. దాంతో ఆ పార్టీ అభ్యర్థులు జనంలోకి వెళ్లేందుకు సాహసించడంలేదు. గ్రామాల్లో అయితే కాంగ్రెస్‌ పేరెత్తితే చాలు.. జనం కొట్టేలా ఉన్నారని స్వయంగా ఆ పార్టీ కిందిస్థాయి నాయకులే వాపోతున్నారు. అందుకే ఇప్పటికే చాలామంది వేరే వేరే దారులు వెతుక్కుంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ కూడా తమ అధినేత లేఖ వల్లే విభజనకు పునాదులు పడ్డాయన్న భయంతో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *