Wednesday, 4 November 2026

సీమాంధ్రలో మేమొక్కరమే మిగులుతాం

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు
హైదరాబాద్‌, మార్చి 10 (జనంసాక్షి) :
సీమాంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఒక్కటే మిగులుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అధికారం కట్టబెడితే రెండు రాష్ట్రాల్లోనూ అభివృద్ధి చేస్తామని అన్నారు. ఆ సత్తా కేవలం టిడిపికే ఉందని తెలిపారు. గతంలో అభివృద్ధిచేసిన గనత టిడిపికే ఉందన్నారు. గత పదేళ్లుగా రాష్ట్రాన్ని దేశాన్ని కాంగ్రెస్‌ భ్రష్టు పట్టించిందన్నారు. రాష్ట్రంలో కొత్త పార్టీ వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సోమవారం టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసే సత్తా తెలుగుదేశానికే ఉందన్నారు. రామకృష్ణారెడ్డి చేరికతో కర్నూలు జిల్లాలో పార్టీబలోపేతం అవుతుందన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు సమర్థత, తపన కావాలన్నారు. సీమాంధ్రలో ఎన్నికలు ఏకపక్షంగా జరగాల్సిన అవసరముందని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఎన్ని ఎక్కువ స్థానాలు ప్రజలిస్తే అంత ఎక్కువ నిధులు కేంద్రం నుంచి తెచ్చుకోవచ్చని, అభివృద్ధి చేయవచ్చని అన్నారు. ప్రజలు నిస్సహాయులై ఉన్నారని, వారిని తిరిగి అభివృద్ది బాటలో పెట్టి, ఉద్యోగావకాశాలు కల్పించాల్సిన అవసరముందన్నారు. ఇలాంటి సమయంలో ఎవరైనా వారికి న్యాయం చేయాలని అనుకుంటే కొత్త పార్టీలు పెట్టే కన్నా తెలుగుదేశానికి మద్దతివ్వాలన్నారు. సీనియర్‌ నేతగా సీమాంధ్రను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఏ ఇద్దరు కలిసినా సీమాంధ్రను ఎవరు అభివృద్ధి చేయగలరన్నదానిపైనే చర్చ జరగాలన్నారు. ఈ ఎన్నికలు అక్కడి ప్రజల భవిష్యత్తును నిర్ణయించేవని పేర్కొన్నారు. తాను ఇందిరాగాంధీతో పోరాడానని, రాజీవ్‌గాంధీతో పోరాడానని, చెన్నారెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, జలగం వెంగళరావులతో పోరాడానని.. చివరకు రాజశేఖరరెడ్డితో పోరాడానని ఇప్పుడు ఒక సైకోతో తలపడాల్సి రావడం, పోల్చుకోవలసిరావడం బాధగా ఉందని చంద్రబాబు వాపోయారు. జగన్‌ది రాజకీయ ఆరాటం కాదని, కేసులు, బెయిల్‌ కోసం పోరాటమని విమర్శించారు. కొత్తగా పార్టీ పేరుతో వస్తున్న కిరణ్‌కు ఓటేస్తే మురిగిపోయినట్లే. సీమాంధ్రులు సంక్షోభంలో ఉన్నారు. వాళ్లకు ధైర్యం చెప్పి ముందుకు నడిపించాలి. ఈ సమయంలో ఎవరైనా న్యాయం చేయాలనుకుంటే తెలుగుదేశానికి మద్దతివ్వాలన్నారు. . తెలంగాణ ప్రజలు సీమాంధ్రకు వ్యతిరేకం కాదని, తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని మాత్రమే అడిగారని, అలాగే సీమాంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలకు వ్యతిరేకం కాదని, తమకూ న్యాయం చేయాలని అన్నారని పేర్కొన్నారు. బీసీకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని సిద్దాంతపరమైన నిర్ణయం తీసుకున్నామని, అది వ్యక్తులకు సంబంధించి కాదన్నారు. తాను అధికారంలో ఉండగా అత్యధిక నిధులిచ్చి అభివృద్ధి చేసినవాటిలో ఒకటి కరీంనగర్‌ జిల్లా అని, రెండోది కర్నూలు అని చంద్రబాబు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కాబోయే సీఎం చంద్రబాబేనని ఈ సందర్భంగా రామకృష్ణా రెడ్డి అన్నారు. టిడిపిని గెలిపించడానికి, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి తమవంతు కృషి చేస్తామన్నారు. ఆయన వస్తేనే రాష్ట్రంలో మళ్లీ అభివృద్ధిబాట పడుతుందన్నారు. సీమాంధ్రలో ఇప్పుడున్నవి రెండే పార్టీలని.. అందులో సమర్థుడైన నాయకుడు ఉన్నది తెలుగుదేశానికేనని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *