Wednesday, 4 November 2026

న్యూయార్క్‌ అపార్ట్‌మెంట్‌లో భారీ పేలుడు

న్యూయార్క్‌, మార్చి 12 (జనంసాక్షి) :

అగ్రరాజ్యం అమెరికాలో మరో ఘోరం జరిగింది. న్యూయార్క్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌తో పాటు మరో జనావాస సముదాయంలోనూ భారీ పేలుళ్లు సంభవించాయి. బుధవారం ఉదయం న్యూయార్క్‌ నగరం మ్యాన్‌ హటన్‌ ప్రాంతంలో రెండు భారీ భవనాల్లో పేల్లుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లతో భవనాలు కూలిపోయాయని, వాటి కింద పలువురు ప్రాణాలు కోల్పోయి ఉంటారని మీడియా సంస్థలు వార్తలు వెలువరించాయి. తూర్పు హార్లెమ్‌ ప్రాంతానికి సమీపంలో ఈ పేలుళ్లు జరిగినట్లు అధికారులు గుర్తించారు. అనధికారిక ప్రాథమిక వార్తల ప్రకారం 11 మంది గాయపడినట్లు సమాచారం. భారీ శబ్దంతో పేలుళ్లు సంభవించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పేలుడు శబ్దం రాగానే మంటలు, పొగలతో వీధంతా నిండిపోయిందని వారు తెలిపారు. సంఘటన జరిగిన సమాచారం తెలిసిన వెంటనే రంగ ప్రవేశం చేసిన భద్రతా అధికారులు, బాంబు స్వ్కాడ్‌ సిబ్బంది ఘటనా ప్రదేశానికి చేరుకుని అణువణువు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ముందు జాగ్రత్త చర్యగా నగరంలో మెట్రోరైలు సర్వీసులను నిలిపి వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. భవనాల శిధిలాల కింద పలువురు చిక్కుకుని ఉంటారని అగ్ని మాపక దళ సిబ్బంది పేర్కొంటున్నారు. ఉదయం 9.30 గంటలకు ఈ ఘటన జరిగిందని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. డజన్ల కొద్ది పైరింజన్లు అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేసేందుకు, శిథిలాల్లో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు ప్రయాత్నాలు చేస్తున్నాయి. సరిగ్గా ఎక్కడ పేలుడు జరిగిందన్న విషయం ఇప్పుడే ఏమీ చెప్పలేమని అధికార వర్గాలు తెలిపాయి. మెట్రోరైలు సర్వీసులు మొదలయ్యే సమయంలో ఈ పేలుళ్లు జరిగాయి. సమీపంలోని మెట్రోరైలు ట్రాక్‌పై శిధిలాలు పడిపోవడంతో నగరంలో మెట్రో రైళ్ల సర్వీసులు నిలిపేశారు. ఎంత మంది మరణించారన్న విషయం కూడా ఇప్పుడే చెప్పలేమని అధికార వర్గాలు తెలిపాయి. హెలికాప్టర్లతో పరిస్థితిని సమీక్షించేందుకు అధికారులు ఏరియల్‌ సర్వే నిర్వహించగా, ఆ భవనాలు పూర్తిగా కూలిపోయాయని తేలింది. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. భారీపేలుడు శబ్దాలు రావడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంతో ముందుజాగ్రత్తగా అనేక మెట్రో రైలు సర్వీసులను అధికారులు రద్దు చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *