Wednesday, 4 November 2026

నడిచేపోతాం.. కలిసే పోటీచేస్తాం


వామపక్షాల నిర్ణయం
హైదరాబాద్‌, మార్చి 13 (జనంసాక్షి) :
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కలిసే పోటీ చేయాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. సార్వత్రిక, రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీపై సీపీఎం, సీపీఐ నేతలు చర్చించి ఓ నిర్ణయానికి వచ్చారు. నగరంలోని మగ్దూం భవన్‌లో గురువారం సీపీఐ, సీపీఎం నేతలు సమావేశమయ్యారు. కలసి ఎన్నికల్లో ముందుసాగాలన్న నిర్ణయానికి వచ్చారు. పార్లమెంట్‌, అసెంబ్లీ, మున్సిపల్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా వీరు చర్చించారనితెలుస్తోంది. అలాగే ఎన్నికల్లో ఏయే పార్టీలతో పెట్టుకోవాలనే దానిపై కూడా కసరత్తు చేసినట్లు సమాచారం. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి పొత్తులు పెట్టుకోవాలని సీపీఎం, సీపీఐ పార్టీలు నిర్ణయించాయి. పొత్తుల విషయమై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, సీపీఎం నాయకుడు రాఘవులు, పార్టీల ఇతర నాయకులు భేటీ అయ్యారు. అనంతరం నారాయణ, రాఘవులు విలేకరులలో మాట్లాడారు. మున్సిపల్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులు ఉంటాయని చెప్పారు. సీట్ల సర్దుబాటు కోసం మరో దఫా చర్చించనున్నారు. కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీయేతర పార్టీలతో ముందుకెళ్లాలని నిర్ణయించారు. తాజా నిర్ణయంతో వామపక్షాలు చాలాకాలం తరువాత ఎన్నికల బరిలో నిల్చుంటున్నాయి. గతంలో కాంగ్రెస్‌తో ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీతో ఒక పార్టీ జత కలిసి ఎన్నికల బరిలో దిగాయి. బిజెపిలాంటి మతతత్వ పార్టీని దూరంగా పెడుతామన్నారు. కాగా, పవర్‌ స్టార్‌ పవన్‌కల్యాణ్‌ కొత్త పార్టీ పెట్టడాన్ని వామపక్షాలు స్వాగతించాయి. ఈ సందర్భంగా నారాయణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నటుడు పవన్‌ కల్యాణ్‌ అందంగా ఉంటాడు అంతే తప్ప ఇంకేమీ తెలియదన్నారు. ఆయన అందగా ఉంటాడని తెలుసునని, ఓట్లు రాబడుతారో లేదో తెలియదన్నారు. మిగతా అంశాలపై తాము పార్టీ పెట్టాక ఆలోచిస్తామన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో సిపిఎం, సిపిఐ కలిసి పోటీ చేస్తుందని సిపిఎం కేంద్ర పొలిట్‌ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు స్పష్టం చేశారు. పొత్తులపై మరోసారి చర్చలు జరుపుతామని చెప్పారు. గతంలో సిపిఎం, సిపిఐలకు విధానపరమైన కారణాలున్నా.. ఇప్పుడు కొత్తగా రెండు రాష్ట్రాలు ఏర్పడిన నేపథ్యంలో డిమాండ్స్‌, రాజకీయాలు వేరయ్యాయని అన్నారు. దాంతో సర్దుబాట్లు వేరుగా ఉంటున్నాయని చెప్పారు. రాబోయే కాలంలో తమ పార్టీలు ఎలా ముందడుగు వేయాలో చర్చించుకుంటామని వెల్లడించారు. సిపిఐ, టిఆర్‌ఎస్‌ తో సర్దుబాట్లు చేసుకున్నా, సిపిఎంతో పొత్తుల గురించి చర్చించాలని అన్నారు. పవన్‌ పార్టీని స్వాగతిస్తున్నామని, విధి విధానాలు చూసి స్పందిస్తామని అన్నారు. కొత్తగా వచ్చే పార్టీలను బేరీజు వేసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్‌, బిజెపికి వ్యతిరేకంగా ఏ పార్టీతోనైనా కలిసి పనిచేస్తామని తెలిపారు. పరిపాలనా యంత్రాంగం నిర్వహణ పరంగా రాష్ట్ర ఎలక్షన్‌ కమిషన్‌ ఎన్నికల నిర్వహణకు సంసిద్ధంగా ప్రశ్నించారు. రాష్ట్రంలో సిపిఎం, సిపిఐ కలిసి పోటీ చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. రాజకీయ పరిస్థితులను చర్చించామని తెలిపారు. వచ్చేవారం ఇరు పార్టీల నేతలు మరోసారి సమావేశమవుతారని కలసి పోటీ చేసేందుకు ఇరు పార్టీలు సుముఖంగా ఉన్నాయన్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలను కూడా చర్చించామన్నారు. ముందుగా స్థానిక ఎన్నికల్లో కలసి సాగుతామన్నారు. విజయవాడలో ఉమ్మడిగా పోటీ చేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *