Wednesday, 4 November 2026

ఎన్నికల వాయిదాకే అఖిలపక్షం మొగ్గు


ఇదే విషయాన్ని సుప్రీంకు నివేదించనున్న ఈసీ
హైదరాబాద్‌, మార్చి 13 (జనంసాక్షి) :
స్థానిక ఎన్నికల వాయిదాకే రాష్ట్రంలోని రాజకీయ పార్టీల అఖిలపక్షం మొగ్గు చూపింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం సమావేశమైంది. మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు వాయిదా వేయాలని ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలు సూచించాయి. రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు శుక్రవారం ఎన్నికల సంఘం నివేదించనుంది. సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున పరిషత్‌ ఎన్నికలు నిర్వహించలేమని సుప్రీంకోర్టుకు ఎన్నికల సంఘం తెలిపిన విషయం విదితమే. ఎన్నికలు అనివార్యమైన పక్షంలో జెడ్పిటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలను సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రకటించాలని పలు రాజకీయ పార్టీలు కోరాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో జరిగిన అఖిలపక్షసమావేశంలో ఈ సూచన చేశారు. సమావేశానికి 17 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. అసెంబ్లీ, లోకసభ ఎన్నికలు ఉన్నందున స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు ఇబ్బందులున్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం సుప్రీం కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. మే 15 తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది. జెడ్పిటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వాయిదాపై చర్చించారు. సమావేశంలో పార్టీలు తెలిపిన అభిప్రాయాలను రాష్ట్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు నివేదిస్తుంది. అలాగే ఎన్నికల తేదీలను కూడా సుప్రీంకోర్టుకు తెలిసయజేస్తుంది. ఫలితాలను సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రకటించాలన్న సూచనకు, తాము బ్యాలెట్‌ బాక్సులకు రక్షణ కల్పించలేమని ఎన్నికల సంఘం తెలిపింది.రాష్ట్ర ఎన్నికల సంఘం మెడమీద కత్తి పెట్టి ఎన్నికలు జరపాలనడం సరికాదని పలు పార్టీలు అభిప్రాయపడ్డాయి. జెడ్పిటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ విషయంలో సిబ్బంది విద్యార్థుల పరీక్షలు ఇతర అంశాలు దృష్టిలోపెట్టుకొని నోటిఫికేషన్‌ జారీ చేసిఉంటే బాగుండేదని వైఎస్‌ఆర్‌సీపీ నేత మైసూరారెడ్డి అన్నారు. అయితే ఎన్నికలను రీషెడ్యూల్‌ చేయగలిగితే చేయండి, లేకపోతే ఎన్నికలు జరుపుకోమని చెప్పినట్లు తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఫలితాలు మాత్రం సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రకటించాలని ఆయన కోరారు. న్యాయస్థానాలు పరిస్థితులను వాస్తవిక దృష్టితో చూడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శ నారాయణ కోరారు. అమెరికా తరహాలో అన్ని ఎన్నికలను ఒకేరోజు నిర్వహించడం మంచిదికాదని బిజెపి నేత ఇంద్రసేనా రెడ్డి చెప్పారు. టీడీపీ నేత మండవ వెంటేశ్వరరావు, టీఆర్‌ఎస్‌ నేత పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నేత ఉమామహేశ్వర రావు, బీజేపీ నేత మల్లారెడ్డి, సీపీఎం నేత వై.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *