కానరాని పురోగతి
బీజింగ్, మార్చి 14 (జనంసాక్షి) :
అదృశ్యమైన మలేషియన్ విమానం ఆచూకీ ఇంకా లభ్యమవలేదు. అదృశ్యమైన విమానం సముద్రంలో కూలిందా, ఎవరైనా హైజాక్ చేశారా అన్న విషయం కూడా తెలియ రావడం లేదు. మలేషియన్ విమానం గల్లంతయ్యాక ఎవరికి వారు విశ్లేషణలు చేస్తున్నారే తప్ప ఆచూకీ మాత్రం కనుక్కరోలేక పోయారు. ఇదో మిస్టరీగా ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తోంది. ఇంతగా టెక్నాలజీ అభివృద్ది జరిగినా దర్యాప్తు మాత్రం ముందుకు సాగడం లేదు. ఇది కుప్పకూలిందా లేక ఏమయ్యిందన్న నిజం తెలియడం లేదు. వారం రోజుల క్రితం అదృశ్యమైన మలేసియా ఎయిర్ లైన్స్ విమానం శిథిలాలు చైనా సముద్రంలో దొరికాయంటూ.. మూడు శాటిలైట్ చిత్రాలను చైనా విడుదల చేసింది. 239 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్న ఈ విమానం కోసం ఆరు రోజులుగా ప్రయత్నిస్తున్నా ఎలాంటి సమాచారం దొరకలేదు. స్టేట్ అడ్మినిస్టేష్రన్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ, ఇండస్ట్రీ ఫర్ నేషనల్ డిఫెన్స్ సంస్థ ఈ చిత్రాలను విడుదల చేసింది. మలేసియా, వియాత్నం మధ్యలో ఈ వస్తువులున్నట్లు చైనా పేర్కొంది. దక్షిణ చైనా సముద్రం మీద ప్రయాణిస్తున్న సమయంలో 2.40 ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. మరుసటి రోజు పొద్దున 6.30 గంటలకు బీజింగ్‌లో లాండ్ అవ్వాల్సిన విమానం ఎంతకీ రాలేదు. ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అంచనాకు వచ్చారు. గల్లంతైన విమానం కోసం మలేసియా అధికారులు చర్యలు చేపట్టారు. 15 విమానాలు, 9 నౌకలను రంగంలోకి దించారు. వియత్నాం తీరంలోని సముద్రంలో ప్రమాదానికి సంబంధించిన ఆనవాళ్లు గుర్తించారు. మునిగిపోయిన విమానంలో ఉన్న బ్లాక్‌బాక్స్‌ల కోసం అన్వేశిస్తున్నారు. అయితే విమానం ఇంజన్ నుంచి సంకేతాలు కూడా లభంచడం లేదు. దీనిని ఎవరైనా పేల్చేసారా లేక మరనేమైనా జరిగిందా అన్నది కూడా అంతుచిక్కడం లేదు. మలేషియన్ విమాన ప్రమాదంలో అదృశ్యమైన విమానం కోసం గాలింపు వేగవంతమైంది. ప్రమాదానికి కారణమేంటనేది ఇప్పటికీ అంతుచిక్కకపోవడంతో అధికారులు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. దీని వెనక కుట్ర ఏదైనా దాగుందా? అన్న అనుమానాలు వారిలో వ్యక్తమవుతున్నాయి. కూలిపోయిన విమానంలో అనుమానితులు ప్రయాణించటం కూడా కుట్ర కోణానికి బలమిస్తోంది. అసలేం జరిగిందన్న అనుమానం అందరిని వేధిస్తోంది. దీని వెనక ఉగ్రవాదుల కుట్ర ఉందా? అన్న కోణంలో అధికారులు పరిశోధనలు సాగిస్తున్నారు. విమాన ఆచూకీ కనుగొనేందుకు ఏర్పాటైన రక్షణ దళాలు తాము అన్వేషించే ప్రాంతాన్ని విస్తృతపరిచాయి. దొంగిలించిన పాస్‌పోర్టుతో ప్రయాణించిన ఇద్దరి సీసీ టీవీ రికార్డులను విచారణాధికారులు పరిశీలిస్తున్నారు. వియత్నాంకు దక్షిణ దిశలో ఉన్న దక్షిణ చైనా సముద్రంలో కనిపించకుండా పోయిన ప్రాంతంలో వాయు, నౌకా దళాలు గాలిస్తున్నాయి. దీంతో పాటే మలేషియా పశ్చిమ తీరాన్ని కూడా గాలిస్తున్నారు. ఈ విమానంలో టికెట్లు కొన్న 5గురు విమానం ఎక్కలేదు. అసలు వారెందుకు విమానం ఎక్కలేదు. దొంగ పాస్‌పోర్టుతో ప్రయాణిస్తున్న వారెవరు? ఇవన్నీ ఇప్పుడు విచారణాధికారులు శోధించే పనిలో పడ్డారు. విమానం ఆచూకీ కోసం 22 విమానాలు, 40 నౌకలు పాలుపంచుకుంటున్నాయని మలేషియా సైనిక దళాల ప్రధానాధికారి జుల్‌కెప్లీ జిన్ తెలిపారు. విమానం వెనకకు మళ్లే అవకాశాలున్నాయని రాయల్ మలేషియన్ ఏయిర్ ఫోర్స్‌కు చెందిన రోద్‌జలి దావుద్ అన్నారు. రాడార్ సిగ్నల్స్ ఆధారంగా విమానం వెనకకు మళ్లినట్టు అనిపిస్తోందని ఆయన ప్రకటించారు. దక్షిణ చైనా సముద్రంలో చమురు తెట్టు కనిపించిన ప్రాంతంలో వియత్నాం నౌకా దళం చేరుకుని అక్కడ విమాన శకలాలేవీ కనిపించలేదని ప్రకటించింది. మరోవైపు ప్రయాణికుల పట్టికలో ఇద్దరు అనుమానితులున్నారని మలేషియా రవాణా శాఖమంత్రి హిషాముద్దీన్ చెప్పారు. ఒక వ్యక్తి తప్పుడు ఇటాలియన్ పాస్‌పోర్టుతో, మరో వ్యక్తి తప్పుడు ఆస్టేల్రియన్ పాస్‌పోర్టు ఉపయోగించి టికెట్లు కొన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు దొంగిలించిన పాస్‌పోర్టులు పోయాయని వీటి అసలు యజమానులు థాయ్‌లాండ్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విమాన ప్రమాదాన్ని అన్ని కోణాల నుంచి అధ్యయనం చేయటానికి అమెరికన్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్ కూడా ఇతర సంస్థలతో జతకట్టింది. అన్ని దేశాల టెర్రరిజం వ్యతిరేక ఏజెన్సీలకు ఈ విషయం గురించి సమాచారం అందించింది. ఈ విమానంలో 14 దేశాలకు చెందిన వారు ప్రయాణించినట్టు తెలుస్తోంది. వీరిలో మూడింట రెండు వంతులు చైనా వారే ఉన్నారు. ప్రమాదానికి గురైన విమానంలో ఐదుగురు భారతీయులున్నారు. చంద్రికాశర్మ, క్రాంతి శిర్‌సాధాలతో పాటు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులున్నారు. చేతనా కోలేకర్, స్వనంద్ కోలేకర్, వినోద్ కోలోకర్‌లు కూలిపోయిన విమానంలో ఉన్నారని భారత రాయబార కార్యాలయం చెప్పింది. కెనడా, రష్యా, ఇటాలియన్, డచ్, ఆస్టియ్రన్‌ల నుంచి ఒక్కొక్కరు వీళ్లతో పాటు ఈ విమానంలో 154 మంది చైనీయులు, 38మంది మలేసియన్లు, ఏడుగురు ఇండోనేసియన్లు, ఆరుగురు ఆస్టేల్రియన్లున్నారు. అటు నలుగురు అమెరికన్లు, ముగ్గురు ఫ్రెంచి, న్యూజీలాండ్‌కు చెందిన ఇద్దరు, ఉక్రెయిన్‌కు చెందిన వాళ్లు ఇద్దరు, కెనడాకు చెందిన ఓ వ్యక్తి ఉన్నట్టు అధికారులు తేల్చారు. రష్యా, ఇటాలియన్, డచ్, ఆస్టియ్రన్‌ల నుంచి ఒక్కొక్కరు ప్రమాద విమానంలో ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.




