పవన్ నేతృత్వంలో ‘జనసేన’ ఆవిర్భావం
సీమాంధ్ర రాజకీయాల్లో కొత్త శక్తి
హైదరాబాద్, మార్చి 14 (జనంసాక్షి) :
రాష్ట్ర విభజన బాధించిందని సినీ నటుడు పవన్ కల్యాణ్ అన్నారు. మాదాపూర్‌లోని నోవాటెల్ హోటల్లో నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ ఉద్వేగంగా ప్రసంగించారు. కాంగ్రెస్ హఠావో .. దేశ బచావో నినాదమే లక్ష్యంగా రాజకీయ రంగప్రవేశం చేస్తున్నట్లు ప్రకటించారు. దేశస్వాతంత్య్ర పోరాటంలో అమరుడైన భగత్‌సింగ్ జీవితం స్ఫూర్తితో నిఖార్సయిన రాజకీయాల కోసం, ప్రశ్నించే తత్వంతో దేశ శ్రేయస్సే లక్ష్యంగా జనసేన పార్టీని ప్రారంభిస్తున్నట్లు సినీనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అభిమానలు జేజే ధ్వానాల మధ్య జనసేన ఆశయాలను ప్రకటించారు. చట్టం అందరికీ ఒకేలా ఉండాలని, కొందరికి చుట్టంలా ఉండకూడదన్నారు. సమానచట్టాలు, బ్లాక్ మార్కెట్ అణచివేయాలన్నారు. మనది కర్మ భూమని, విడగొట్టే రాజకీయాలను సహించబోమన్నారు. దేశంలోనే కాదు ప్రాంతాల మధ్య విభేదాలు ఉండకూడదన్నారు. దేశ సమగ్రతను దెబ్బతీసే నాయకులకు సింహస్వప్నంగా ఉంటానన్నారు. రాజకీయాల్లో నూతన పంథాను ఆయన ఆవిష్కరించారు. కాంగ్రెస్ లక్ష్యంగా ఆయన సోనియా రాహుల్ సహా నేతలందరినీ కడిగి పారేశారు. కేసీఆర్, వీహెచ్ తదితర నేతలందరినీ నేరుగా విమర్శించారు. విభజన తీరు తనను బాధించిందన్నారు. ఇది కాంగ్రెస్ కుటిల రాజకీయాలకు నిదర్శనమన్నారు. వంశపారంపర్య రాజకీయాలతో దేశాన్ని భ్రష్టు పట్టించారని అన్నారు.కాంగ్రెస్ ఏమన్నా గంగానదా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. జనసేన ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగిస్తూ జనసేనను కొంతకాలం తరువాత కాంగ్రెస్‌లో విలీనం చేయాలని కాంగ్రెస్ నేత దిగ్గీరాజా అన్నారని పవన్ పేర్కొన్నారు. తనకు ఈ సలహా ఇచ్చేందుకు ఎవరని ప్రశ్నించారు. ఉదాత్త ఆశయాలు తప్ప మరో దురాలోచన లేదన్నారు. అందరికి స్ఫూర్తిదాయకమైన రాజకీయాలు ఇవ్వాలన్నదే తన ఆశయమని పవన్‌కల్యాణ్ అన్నారు. ఎవరి బెదిరింపులకు లొంగేది లేదన్నారు. జనసేన ఆవిర్భావ సభలో ప్రసంగిస్తూ రాబోయే తరాల కోసం భగత్‌సింగ్ బలిదానం చేశారని ఆయన ఆశయంతోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ఆయన తెలిపారు. రాజ్యసభలో రాష్ట్ర విభజన సందర్భంగా వెంకయ్యనాయుడు పడిన తాపత్రయం తనను కదలించిందన్నారు. అయితే వెంకయ్యనాయుడు మాత్రం తనను దేశానికి పట్టిన దౌర్భగ్యమని విమర్శించడాన్ని ఆయన ప్రస్తావించారు. రాష్ట్రాలుగా విడిపోయిన ప్రజలుగా కలిసివుందామన్న ఆశయాన్ని నిజం చేయగల నేత జగ్గారెడ్డి అని ఆయన పేర్కొన్నారు. ఆయన సారధ్యంలో తెలంగాణ ఏర్పడివుంటే బాగుండేదని కల్యాణ్ అన్నారు. తనకు వీహెచ్‌పై ఎంతో గౌరవముందని అయితే తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్టు విమర్శలు చేశారని, కానీ రాహుల్‌గాంధీ ఒక్క పెళ్లి కూడా చేసుకోలేదన్న విషయాన్నిచెప్పారని కాని ఆయన బ్రహ్మచారి అని చెప్పలేదన్నారు. రాష్ట్ర విభజన తీరు తనకు నచ్చలేదని పదేపదే హీరో పవన్ కల్యాణ్ అన్నారు. సమస్యను అలాగే వదిలేయడం వల్లనే పెనుసమస్యగా మారిందన్నారు. తెలంగాణవాదులు లేవనెత్తిన సమస్యలను అప్పుడే పరిష్కరించివుంటే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థిితి ఏర్పడివుండేది కాదన్నారు. రాష్ట్ర విభజనకు అందరు రాజకీయనాయకులు బాధ్యత వహించాలన్నారు. 2008లో తెలంగాణలో విస్తృతంగా పర్యటించినట్టు ఆయన వెల్లడించారు. 2009 తరువాత తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర కాంక్ష గాఢంగా ఏర్పడినట్టు ఆయన తెలిపారు. కులం, మతం, ప్రాంతం ప్రస్తావన లేకుండా తల్లిదండ్రులు తమను పెంచారని ఆయన చెప్పారు. కొమురం భీమ్ సినిమా పేరును పెట్టుకోవద్దంటూ కొందరు చేసిన ప్రకటనలు తనను ఎంతగానో బాధించాయన్నారు. తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన సంస్థకు చెందిన నిధుల సేకరణ వివరాలకు సంబంధించిన లెక్కలను తెలంగాణ ప్రజానీకానికి వెల్లడించాలని అన్నారు. తనను విమర్శించేముందు వీటికి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కవిత తనకు సోదరి వంటిదని ఆయన పేర్కొన్నారు. తాను చిన్నప్పుడే తెలంగాణ సాయుధ పోరాటం పుస్తకాలు చదివానని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. రాజకీయాల్లోకి రావాలని అన్నీ సిద్ధం చేసుకున్నాక నైరాశ్యం ఆవరించిందన్నారు. ఒకసారి నిరాశ, నిస్పృహలు ఆవరించి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానన్నారు. మార్షల్ ఆర్ట్స్, యోగా నేర్చుకున్నానని, అయినా మనశ్శాంతి లభించేది కాదని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యాలయ విస్తరణ కోసం బీదలు నివసించే భీమ్రావ్బాడా కూల్చివేత తనకు ఎంతో బాధ కలిగించిందని పవన్ కల్యాణ్ అన్నారు. జూబ్లీహిల్స్‌లో ఎంతో స్థలముందని అక్కడ కాంగ్రెస్ తన కార్యాలయాలు కట్టుకోవచ్చని అయితే బీదలు నివసించే స్థలం ఎందుకు కావాలని ఆయన ప్రశ్నించారు. వరంగల్ యాసిడ్‌దాడిలో గాయపడిన స్వప్నికతో తనతో మాట్లాడటం ఎంతో కదలించిందన్నారు. ఈ దాడికి పాల్పడిన యువకుల్ని చంపివేయడం తగదన్నారు. హింసాత్మక సంఘటనలు జరగకుండా విధానాలు రూపొందించాలన్నారు. నల్గొండలో ఫ్లోరోసిస్ బాధితుల కోసం సహాయానికి వెళితే కొంతమంది అడ్డుకోవడాన్ని ఆయన వెల్లడించారు. తనపై కొందరు కాంగ్రెస్ నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగితే వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన వివరాల్ని బయటపెడుతానని హీరో పవన్‌కల్యాణ్ హెచ్చరించారు. వారి భాగోతాలను యూట్యూబ్‌లో పెడుతానని ఆయన అన్నారు. జనసేన ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగిస్తూ మహిళల జీవితాల్ని బయటపెట్టడంసంస్కారం కాదన్నారు. తాను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించనని అది తన సంస్కారమన్నారు. తనను విమర్శించేముందు అన్ని బేరీజు వేసుకున్నాకే విమర్శించాలని హితవు పలికారు.దేశం పట్ల వున్న ప్రేమ, సమాజం పట్ల వున్న బాధ్యతే తనను జనసేవను ప్రారంభించేందుకు కదిలించాయని హీరో పవన్‌కల్యాణ్ అన్నారు. తనకు అనేకమంది రాజకీయనాయకులతో పరిచయముందని ఆయన తెలిపారు.అయితే వారి వ్యవహారశైలి తనకు నచ్చదన్నారు. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని అలాగే సీమాంధ్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే కూడా అంగీకరించబోనన్నారు. సమాజంలో మహిళలకు సముచిత గౌరవం కల్పించేందుకు కృషి చేయాలని పవన్ కల్యాణ్ అన్నారు. తన బాల్యం నుంచి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న అవస్థలను ఆయన వివరించారు. చిన్నప్పుడు బడికి వెళ్లినప్పుడు పుస్తకాలు సకాలంలో వచ్చేవి కావన్నారు. పుస్తకాల్లో పచ్చగా కనిపించే పాఠశాలలు నిజజీవితంలో పచ్చగా లేక ఇరుకు గదులతో వుండటాన్ని ఆయన ప్రస్తావించారు. తనకు సామాజిక స్పృహ చిన్నప్పుడే కలిగిందన్నారు. గత ఐదేళ్లనుంచి ప్రజాసమస్యలపై ఎవరూ మాట్లాడటం లేదని హీరో పవన్‌కల్యాణ్ అన్నారు. జనసేన ఆవిర్భావ సభలో ప్రసంగిస్తూ తనకు దేశం, సమాజం ముఖ్యమేనని అన్నారు. సమస్యలకు భయపడి పారిపోనని ఆయన స్పష్టంచేశారు. పార్టీ పెడుతున్నట్టు తన కుటుంబానికి కూడా చెప్పలేదని ఆయన వెల్లడించారు.నాది తెలంగాణ అని హీరో పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగిస్తూ పార్టీ పెట్టు కానీ తెలంగాణకు క్షమాపణ చెప్పాలని కొందరు ప్రకటనలు చేశారని అయితే ఈ ప్రకటన చేసేందుకు వీరెవరని ఆయన ప్రశ్నించారు. నా తెలంగాణ ఇది నేను ఎవరికీ క్షమాపణ చెప్పనని ఆయన స్పష్టంచేశారు. కాపు నాయకుల గురించి మాట్లాడుతూ పార్టీ పెట్టొద్దనడానికి ఎవరని ప్రశ్నించారు. సామాన్యుడి సేనే జనసేన అని, వారికి సేవ చేయడమే లక్ష్యంగా రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన బాధించింది





