Wednesday, 4 November 2026

పాపం పసివాడు


తమ్ముడి విధానంలో క్లారిటీ లేదు
కేంద్ర మంత్రి చిరంజీవి
హైదరాబాద్‌, మార్చి 15 (జనంసాక్షి) :
పవన్‌ కల్యాణ్‌ చిన్నపిల్లాడని, అతడిలో ఆవేశం ఉంది తప్ప విధానంలో క్లారిటీ లేదని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. శుక్రవారం పార్టీ ప్రకటన సందర్భంగా పవన్‌ చేసిన వ్యాఖ్యలపై శనివారం చిరంజీవి స్పందించారు. కాంగ్రెస్‌ వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న పార్టీ అని దానిని ఎవరూ ఏమీ చేయలేరని చిరంజీవి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీని అంతం చేయటం ఎవరి వల్ల కాదని చిరంజీవి అన్నారు. దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చింది కాంగ్రెస్‌ పార్టీయేనని చిరంజీవి అన్నారు. పవన్‌ కల్యాణ్‌ రాజకీయ పార్టీపై సోదరుడు స్పందించారు. పార్టీ పెట్టడం పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిగతమని ఆయన అన్నారు. చిన్నప్పటి నుంచి పవన్‌ సున్నిత మనస్కుడని, సమాజానికి ఏదో చేయాలనే తపన తమ్ముడిలో ఉందని చిరంజీవి చెప్పుకొచ్చారు. పవన్‌కు భావోద్వేగాలు ఉన్నాయని ప్రజలకు ఎలా సేవ చేస్తారో చూడాలని అన్నారు. జనసేన పార్టీ ఎజెండా, విధివిధానాలు తనకు ఇంకా పూర్తిగా తెలియవన్నారు. అలాగే పవన్‌ కాంగ్రెస్‌ పార్టీపై చేసిన వ్యాఖ్యలను చిరంజీవి పరోక్షంగా సెటైర్లు వేశారు. అన్ని పార్టీల అంగీకారంతోనే కాంగ్రెస్‌ విభజన నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్‌ పార్టీ తొందరపడిందని చెప్పాడని, అయితే తప్పంతా కాంగ్రెస్‌ పార్టీదే అని పవన్‌ వ్యాఖ్యానించటం తనకు బాధ కలిగించాయన్నారు. కాంగ్రెస్‌పై వేలెత్తి చూపేముందు మిగతా పార్టీలపై కూడా చేస్తే బాగుండేదని చిరంజీవి అన్నారు. పవన్‌ కాంగ్రెస్పై చేసిన వ్యాఖ్యల వెనక కుట్ర ఉందో లేదో తనకు తెలియదన్నారు. జనసేన పార్టీ పెట్టి తమ పార్టీపై విరుచుకుపడిన సినీ హీరో పవన్‌ కళ్యాణ్‌పై కాంగ్రెసు నేతలు కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. చిరంజీవి కూడా పవన్‌ కళ్యాణ్‌ పట్ల కఠినంగానే ఉండాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. సున్నితంగానే అయినా చిరంజీవి పవన్‌ కళ్యాణ్‌ను వ్యతిరేకిస్తూ గట్టిగానే మాట్లాడారు. చిరంజీవి వ్యాఖ్యల తర్వాత కాంగ్రెసు నాయకులు తమ దాడిని పెంచారు. తెలంగాణ కాంగ్రెసు నేతలు అత్యంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పొన్నం ప్రభాకర్‌, కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఆయనపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పవన్‌కళ్యాణ్‌ పగటి వేషగాడని నల్లగొండ జిల్లా మాజీ మంత్రి, కాంగ్రెసు శాసనసభ్యుడు వ్యాఖ్యానించారు. మహిళలను కించపరిచే విధంగా, యువతను పక్కదారి పట్టించే విధంగా పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగం చేశాడని ఆయన అన్నారు. పవన్‌ కళ్యాణ్‌ ఆరోగ్య పరిస్థితి బాగా లేదని, వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్పించాలని ఆయన అన్నారు. ప్రజా వేదికపై సినిమా డైలాగులు చెప్పడం సరికాదని కాంగ్రెస్‌ నేత ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పవన్‌ కళ్యాన్‌ను ఉద్దేశించి అన్నారు. కాంగ్రెస్‌పై పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. పవన్‌ చిన్న పిల్లాడని అభిప్రాయపడ్డారు. తెలంగాణ కోసం వేలాది మంది చనిపోయినప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పవన్‌ పార్టీ ప్రభావం తెలంగాణలో ఉండదని ఉత్తమ్‌కుమార్‌ స్పష్టం చేశారు. పవన్‌ కళ్యాణ్‌కు వార్డ్‌మెంబర్‌గా కూడా గెలిచే సత్తా లేదని, అలాంటిది కాంగ్రెస్‌ విమర్శించే స్థాయి ఎక్కడిదని మాజీ మంత్రి బస్వరాజు సారయ్య ప్రశ్నించారు. కాంగ్రెస్‌ చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని ఆయన సూచించారు. తెలంగాణ ఉద్యమం పుట్టినప్పుడు పవన్‌ పుట్టనేలేదని ఆయన శనివారం విూడియా ప్రతినిధులతో అన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం పవన్‌కు తగదని సారయ్య అభిప్రాయపడ్డారు. పవన్‌కళ్యాణ్‌కు మతిభ్రమించిందని వ్యాఖ్యానించారు. అఖిలపక్ష భేటీలో తెలంగాణ ఇవ్వాలని ప్రజారాజ్యం పార్టీ చెప్పలేదా అని ఆయన ప్రశ్నించారు. ఆకాశంపై ఉమ్మితే మనపైనే పడుతుందనే విషయాన్ని పవన్‌ గ్రహించాలన్నారు. పవన్‌కు సోనియా, రాహుల్‌ను విమర్శించే స్థాయి లేదని మరోనేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పవనో పిల్ల కాకి అని వ్యాఖ్యానించారు. పవన్‌ సినిమా ప్రభావం నుంచి బయటపడాలని సూచించారు. సామాజిక న్యాయమంటే ఫైవ్‌స్టార్‌ ¬టల్‌లో పార్టీ పెట్టడం కాదని కేంద్రంమంత్రి బలరాంనాయక్‌ ఎద్దేవా చేశారు. జనసేప పార్టీ కాదు ఓ సినిమా అని ఆయన అన్నారు. సీమాంధ్రకు చెందిన కాంగ్రెసు నాయకులు కూడా పవన్‌ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు. చిరంజీవికి అత్యంత సన్నిహితుడైన మాజీ మంత్రి సి. రామచంద్రయ్యతో పాటు మాజీ మంత్రులు కొండ్రు మురళి, బాలరాజు పవన్‌ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు. ఇలాంటి వాళ్లను కాంగ్రెసు చాలా మందిని చూసిందని వారు అన్నారు. రాజకీయం అంటే సినిమాల్లో నటించినట్లు కాదని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *