Wednesday, 4 November 2026

కేసీఆర్‌ది ధోఖా


వంచన, మోసం
ఆయన నైజం
దామోదర రాజనర్సింహా ఫైర్‌
హైదరాబాద్‌, మార్చి 16 (జనంసాక్షి) :
టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ది ధోఖాబాజీ తన మని, దగా, వంచన, మోసానికి మారుపేరు కేసీఆర్‌ అని మాజీ ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత దామోదర రాజనర్సింహ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆదివారం గాంధీ భవన్‌లో మాజీ మంత్రి
షబ్బీర్‌ అలీతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామన్న కేసీఆర్‌ తెలంగాణ విభజన జరిగిన తర్వాత ప్లేటు ఫిరాయించారని దుయ్యబట్టారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోని వాడు రేపు ప్రజలకు ఇచ్చే హామీలను నెరవేరుస్తాడన్న నమ్మకం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు తమ పార్టీ అధినేత ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్ని అడ్డంకులు, విమర్శలు వచ్చినా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందన్నారు. పూటకోమాట, రోజుకో వైఖరి ప్రకటించే వారిని ప్రజలు నమ్మబోరన్నారు. కాంగ్రెస్‌లో టిఆర్‌ఎస్‌ను కలువమని కోరలేదని, ఆయనే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా దామోదర గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ఒక్కరివల్ల రాలేదని, దీనివెనక ఎందరో పోరాటాలు, బలిదానాలు, లాఠీదెబ్బలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తించాలన్నారు. టిఆర్‌ఎస్‌ పార్టీ తమతో పొత్తు పెట్టుకుంటుందని మొదట ఆశ పడ్డామని, కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయనకు అధికార దాహం, పదవీకాంక్ష పెరిగిందని, అమరవీరుల కుటుంబాలకు టిక్కెట్లు ఇస్తానన్నవాడు తీరా ఎన్నికల తేదీ ప్రకటించాక ఎడమచేయి చూపాడని దుయ్యబట్టారు. దళితుడిని సిఎం చేస్తా, ముస్లింలను ఉప ముఖ్యమంత్రిని చేస్తానన్న అతని వాగ్దానాలు ఏమైపోయాయని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అనంతరం షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ, కేసీఆర్‌ వాలకం చూస్తుంటే ఏరుదాటే ముందు ఓడమల్లన్న, ఏరుదాటాక బోడిమల్లన్న అన్న చందంలా ఉందని విమర్శించారు. ఓట్లు, సీట్లకోసం తమ పార్టీ తెలంగాణ ఇవ్వలేదని, అరవై ఏళ్లుగా తెలంగాణ ప్రజలు చేస్తున్న పోరాటం, ఆత్మగౌరవాన్ని గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ పొలిటికల్‌ జేఏసీకి చెందిన అద్దంకి దయాకర్‌, ఓయూ ఐకాస నేత శశాంక్‌లు దామోదర రాజనర్సింహ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *