Wednesday, 4 November 2026

గోద్రా అల్లర్లలో


మోడీకి క్లీన్‌చీట్‌ సరికాదు
సిట్‌ పనితీరుపై
పలు అనుమానాలు
సరిజోడి దొరికితే పెళ్లాడుతా
యూపీఏ తిరిగి అధికారంలోకి వస్తుంది
పీటీఐ ఇంటర్వ్యూలో రాహుల్‌
న్యూఢిల్లీ, మార్చి 16 (జనంసాక్షి) :
గోద్రా అల్లర్ల కేసులో గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి క్లీన్‌చీట్‌ ఇవ్వడం సరికాదని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. 2002లో గోద్రాలో ఒకవర్గంపై ఊచకోతలు సాగుతున్నా పాలకపక్షం స్పందించలేదని, అక్కడి ప్రభుత్వం అండతోనే మైనార్టీలను దారుణంగా, కిరాతకంగా హతమార్చారని రాహుల్‌ పేర్కొన్నారు. ఆయన చేసింది క్షమా ర్హం కాని నేరమన్నారు. ఆదివారం ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. సుప్రీం కోర్టు గోద్రా ఊచకోతలపై నియమించిన సిట్‌ బృందం మోడీకి క్లీన్‌ చీట్‌ ఇచ్చిందంటూ ప్రచారం చేసుకుంటుందని, కానీ పలువురు నిపుణులు సిట్‌ దర్యాప్తు తీరును ప్రశ్నిస్తున్న విషయాన్ని బీజేపీ విస్మరిస్తుందని అన్నారు. సిట్‌ దర్యాప్తులో అనుసరించిన తీరుపై కింది స్థాయి న్యాయస్థానాలు అనేక సందేహాలు లేవనెత్తాయని తెలిపారు. గోద్రా ఊచకోతలకు మోడీ నైతిక బాధ్యత వహించి తీరాలన్నారు. గోద్రా అల్లర్ల కేసులో సుప్రీం కోర్టు పరిశీలన ఇంకా పూర్తి కాలేదన్నారు. ఈ అల్లర్లపై సమాధానం దొరకని ప్రశ్నలు, చిక్కుముళ్లు ఇంకా ఎన్నో ఉన్నాయన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి భారీ ఓటమి తప్పదన్న ఓపినియన్‌ పోల్స్‌ను రాహుల్‌ కొట్టి పారేశారు. త్వరలో జరుగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ఘన విజయం సాధించి మూడో సారి అధికారాన్ని నిలబెట్టుకుంటామన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అండర్‌ డాగ్‌ పరిస్థితులను ఎదుర్కోబోతుందన్న ఆర్థిక మంత్రి పి. చిదంబరం వ్యాఖ్యలను రాహుల్‌ కొట్టిపారేశారు. 2009లోనూ ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా కాంగ్రెస్‌ 206 సీట్లలో గెలుపొందిన విషయాన్ని రాహుల్‌ గుర్తు చేశారు. తన పెళ్లిపై వస్తున్న ప్రశ్నలకు రాహుల్‌ స్పందించారు. సరైన జోడి దొరికితే పెళ్లి చేసుకుంటానని రాహుల్‌ చెప్పారు. అయితే ప్రస్తుతం ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. తన పెళ్లిపై ఎప్పుడూ ఎవరో ఒకరు ప్రశ్నిస్తూనే ఉన్నారని అయితే రాజకీయాల్లో బిజీగా ఉన్న తాను వ్యక్తిగత జీవితంపై ఇంతవరకూ దృష్టి పెట్టలేదని అన్నారు. తగిన అమ్మాయి దొరికినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానని అన్నారు. తన అభిరుచులపై రాహుల్‌ స్పందిస్తూ ఎక్కువగా కాల్పనిక సాహిత్యాన్ని చదువుతానని అన్నారు. అందులోనూ తనకు ఉపయోగ పడే చరిత్ర, భౌగోళికశాస్త్రం, రాజకీయ వ్యవహారాలు, ఆఫ్ఘనిస్థాన్‌, పాకిస్థాన్‌, చైనా దేశాలకు సంబంధించిన పుస్తకాలు చదువుతానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *