
రంగంలోకి 25 దేశాలు
పైలెట్ల ఇళ్లపై దాడులు
రాజకీయ కోణంలో దర్యాప్తు
కౌలాలంపూర్, మార్చి 16 (జనంసాక్షి) :
అదృశ్యమైన మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఆచూకీ కోసం ముమ్మర గాలింపు సాగుతోంది. 25 దేశాలు దర్యాప్తులో పాలు పంచుకుంటు న్నాయి. పైలెట్లు మళ్లించి ఉంటారనే విచారణ కమిటీ నివేదిక నేపథ్యంలో పైలెట్, కో పైలెట్ ఇళ్లపై దాడులు చేశారు. వారి వ్యక్తిగత రాజకీయ అభిరుచులు, వారి రాజకీయ అనుబంధాలు విమాన అదృశ్యానికి కారణం ఏమైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు సాగిస్తున్నారు. 40 ఓడలు, 22 విమానాలతో దర్యాప్తును ముమ్మరం చేశారు. కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు బయల్దేరిన విమానం అదృశ్యమైన విషయం విధితమే. వియత్నాం తీరం నుంచి దక్షిణ చైనా సముద్రం, ఖజకిస్తాన్, తుర్కుమెనిస్థాన్, ఉత్తర థాయ్‌ల్యాండ్, దక్షిణ ఇండోనేషియా, దక్షిణ హిందూ మహాసముద్రం, అండమాన్ నికోబార్ దీవులు తదితర ప్రాంతాల్లోని సాగర జలాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం నిర్వహించిన దర్యాప్తులో పాకిస్తాన్ దిశగా మళ్లింది. పాకిస్థాన్‌లోనే విమానాన్ని ల్యాండ్ చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మార్చి 8న అర్ధరాత్రి 12.41 గంటలకు బయల్దేరిన విమానం ఆరు గంటల ప్రయాణం తర్వాత 9న ఉదయం బీజింగ్‌కు చేరుకోవాల్సి ఉంది. అయితే బయల్దేరిన గంట తర్వాత వియాత్నంలోని హోచిమిన్ నగరం గుండా ప్రయాణిస్తున్న సమయంలో విమానానికి ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం సముద్రంలో కూలిపోయినట్లుగా అనుమానించారు. ఆ తరువాత కూడా రాడార్ సంకేతాలు అందకపోవడంతో కొన్ని గంటలు వెనక్కి మళ్లినట్లు దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి. దీంతో అమెరికా, చైనా, ఫ్రాన్స్‌తో పాటు వివిధ దేశాల ఉపగ్రహాలకు సంబంధించిన సమాచారం ఇవ్వాల్సిందిగా మలేషియా ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో ఆయా దేశాలు దర్యాప్తును ముమ్మరం చేశాయి.
మలేషియా విమానం కోసం తీవ్ర గాలింపు




