
ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్
బెంగళూర్, మార్చి 16 (జనంసాక్షి) :
బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీపై పోటీకి సిద్ధమని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తేల్చిచెప్పారు. మోడీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గ ప్రజలు కనుక తాను పోటీ చేయాలని కోరుకుంటే తాను సిద్ధమన్నారు. ఆదివారం బెంగళూర్‌లో నిర్వహించిన ర్యాలీలో కేజ్రీవాల్ మాట్లాడారు. మోడీపై తాను పోటీ చేయాలని తమ పార్టీ కోరుకుంటోందని ఆయన తెలిపారు. తాను కూడా అందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వారణాసిలో ఈనెల 23న నిర్వహించే పార్టీ ర్యాలీలో ప్రజల నుంచి వచ్చే స్పందన ఆదారంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. నరేంద్రమోడీని ఓడించడమే లక్ష్యంగా పోటీకి దిగుతానని కేజ్రీవాల్ అన్నారు. మోడీపై పోటీ చేసే అంశాన్ని అతిపెద్ద సవాల్‌గా తాను భావిస్తున్నానని తెలిపారు. అయితే మోడీని రెండు పార్లమెంట్ స్థానాల నుంచి పోటీకి సిద్ధమవుతున్నట్లు తనకు సమాచారం అందిందని అన్నారు. ఒకటి వారణాసి కాగా మరొకటి తన గెలుపునకు ఇబ్బంది లేకుండా గుజరాత్‌లోని ఏదో ఒక నియోజకవర్గాన్ని ఎంచుకునే అవకాశమున్నట్లు చెప్పారు. ఒకవేళ మోడీ కనుక గుజరాత్‌లోని మరో నియోజకవర్గం నుంచి కనుక పోటీకి దిగితే ఆయన గుజరాత్‌కే నాయకుడవుతాడు తప్ప దేశ ప్రధాని పదవి చేపట్టేందుకు ఏమాత్రం అర్హుడుకాదన్నారు. భారత దేశానికి ధైర్యవంతుడు ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, అందుకు విరుద్ధంగా మోడీ ప్రవర్తిస్తున్నాడని ఎద్దేవా చేశారు. అధికారం కోసం, డబ్బుల కోసమో తాము రాజకీయాల్లోకి రాలేదని కేజ్రీవాల్ చెప్పారు. తమ జీవితాలను త్యాగం చేసింది ప్రజలకోసమేనన్నారు. భగత్‌సింగ్‌లాగా దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసే అవకావం వస్తే ధన్యుడిగా భావిస్తానని అన్నారు.
మోడీపై పోటీకి సై




