Wednesday, 4 November 2026

టీఆర్‌ఎస్‌ వైపు కొండా దంపతుల చూపు


వరంగల్‌, మార్చి 17 (జనంసాక్షి) :
వరంగల్‌ జిల్లాకు చెందిన కీలకనేతలు కొండా సురేఖ దంపతులు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్దం అయ్యింది. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వారిని పార్టీలోకి ఆహ్వానించినట్లు సమా చారం. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ, వరంగల్‌ తూర్పు నియోజకర్గ స్థానాలు తమకు కేటాయించాలని వారు కేసీ ఆర్‌ను కోరినట్లు సమాచా రం. మరోవైపు సోమవారం వరంగల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలు కొండా దంపతులతో భేటీ నిర్వహించారు. పర కాల, భూపాలపల్లి, వరంగల్‌ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో కొండా దంపతులకు మంచి పట్టు ఉండ డంతో వారి చేరిక పార్టీకి ఉపయోగ కరంగా ఉంటుందని టీఆర్‌ఎస్‌ నేతలు భావిస్తున్నారు. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులతో కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా ఏ పార్టీలో చేరాలన్నదానిపై తీవ్ర తర్జనాభర్జనలు పడిన కొండా దంపతులు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ విషయంపై టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కె చంద్రశేఖర్‌రావుతో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. కొండా సురేఖకు వరంగల్‌ తూర్పు అసెంబ్లీ స్థానం కేటాయించేందుకు టీఆర్‌ఎస్‌ నాయకులు అంగీకారం తెలిపినట్లు సమాచారం. కొండా మురళీకి స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ టికెట్‌ ఇచ్చేందుకు కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు బలమైన అభ్యర్థి లేకపోవడం ఆ నియోజకవర్గంలో కొండా సురేఖకు మంచి ఆదరణ ఉండటంతో సురేఖకు టికెట్‌ ఇచ్చేందుకు టిఆర్‌ఎస్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. కాగా, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి ఆయన కుమారుడు వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి స్థాపించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో కొండా దంపతులు చేరారు. ఆ తర్వాత తెలంగాణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయంతో తీసుకోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేయడంతో కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. వారు కాంగ్రెస్‌ను వీడేందుకు తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నియమితులు కావడం కూడా కారణంగా తెలుస్తోంది. ఇదిలావుంటే తెలంగాణలో టిడిపి, కాంగ్రెస్‌ మునిగిపోయే నావలని టిఆర్‌ఎస్‌ నేతలు అన్నారు. ఇక్కడ ఒకవేళ ఏ మాత్రం టిడిపి బతికితే అది ఆంధ్ర ప్రభుత్వానికే కొమ్ముకాస్తుందని టిఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఖమ్మం జిల్లాలో చంద్రబాబు మాట్లాడిన తీరు ‘ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ’ అన్నట్లుగా ఉందన్నారు. తెలంగాణకు న్యాయం జరగాలన్నా, అభివృద్ధి పథంలో సాగాలన్నా టిఆర్‌ఎస్‌ అధికారంలోకి రావాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కూడా తన దోపిడీని కొనసాగించాలని చంద్రబాబు భావిస్తున్నారని, ఆయన ఆటలు ఇక సాగవని తెలిపారు. తెలంగాణలో టిడిపిపా ఒక్క సీటు కూడా గెలవబోదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *