విచారణకు ఆదేశించిన నరసింహన్
విచారణాధికారి ఎల్వీ వేణుగోపాల్ రెడ్డి
హైదరాబాద్, మార్చి 18 (జనంసాక్షి) :
మెడికల్ పీజీ ఎంట్రన్స్ పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లుగా వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్ విచారణకు ఆదేశించారు. ప్రొఫెసర్ ఎల్వీ వేణుగోపాల్‌రెడ్డిని విచారణాధికారిగా నియమించిన గవర్నర్ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలని కోరారు. మెడికల్ పీజీ ప్రవేశ పరీక్షలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలని జూనియర్ డాక్టర్లు మంగళవారం రాజ్ భవన్‌లో గవర్నర్ నరసింహన్ ను కలసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 14 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా ఈ యేడాది పరీక్షా పత్రం చాలా క్రిటికల్ గా ఉందన్నారు. అయితే ఎప్పుడూ ఫెయిల్ అయ్యే విద్యార్థులకు 190 కి గాను 180 మార్కులు రావడం విచిత్రంగా ఉందని తెలిపారు. దీంతో మెరిట్ స్టూడెంట్స్ పీజీలో సీట్లు కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షా పత్రం లీకయిందని వారు ఆరోపించారు. ఈ విషయంలో సిబిఐ విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. అంతకు ముందు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ రిజిష్టార్ర్ ఆఫీసు ముందు జూడాలు ఆందోళనకు దిగారు. రిజిస్టార్ర్‌ని కలిసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అత్యంత కష్టమైన పరీక్షలో ఎప్పుడూ ఫెయిల్ అయ్యే వారికి అత్యధిక మార్కులు రావడం సందేహాలకు దారితీస్తోందని జూడాలు అంటున్నారు. మరోవైపు లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌నారాయణ మంగళవారం సాయంత్రం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు.





