Tuesday, 3 November 2026

మోడీని ఓడించడమే నా లక్ష్యం


ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌
న్యూఢిల్లీ, మార్చి 18 (జనంసాక్షి) :
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని ఓడించడమే తన లక్ష్యమని ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ తేల్చిచెప్పారు. మోడీకి ఓటమిని రుచి చూపించేందుకే వారణాసి నుంచి పోటీకి సిద్ధమ వుతున్నానని ఆయన అన్నారు. మోడీ వారణాసిలో పోటీ చేస్తున్నారు కాబట్టి తాను అక్కడికి వెళ్తానని చెప్పారు. మోడీపై పోటీ చేయాలా వద్దా? అని అక్కడి ప్రజలను అడుగుతానని వారు చేయమంటే పోటీకి సిద్ధమని తెలిపారు. తాము గుర్తింపు కోసం ఉబ లాటపడుతున్నామనే మీడియా కథనాలను కేజ్రీవాల్‌ ఖండించారు. తాను మోడీని ఓడించేందుకే వారణాసి వెళ్లడానికి సిద్ధపడినట్లు చెప్పారు. అన్ని పార్టీలు ఒక్కటేనని అవినీతి, మతతత్వ రాజకీయాలకు పాల్పడుతున్నాయని తెలిపారు. రాహుల్‌గాంధీ, నరేంద్రమోడీలను ఓడించడమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగుతున్నామని అన్నారు. అమేథిలో రాహుల్‌కు పోటీగా కుమార్‌ విశ్వాస్‌ను నిలుపుతున్నామన్నారు. మోడీకి ఓటేస్తే సుస్థిర ప్రభుత్వాన్ని అందిస్తామని బీజేపీ ప్రకటిస్తోందని మన్మోహన్‌ పదేళ్లు అధికారంలో ఉండి అంతకన్నా సుస్థిర ప్రభుత్వాన్నే ఇచ్చారని వ్యాఖ్యానించారు. ప్రజలు సుస్థిరతను కోరుకోవడం లేదని, భద్రతను కోరుకుంటున్నారని తెలిపారు. భాజపా హిందువులకు, కాంగ్రెస్‌ ముస్లింలకు చేసిందేమి లేదని అన్నారు. అన్ని పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకే పాల్పడుతున్నాయని తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *