Tuesday, 3 November 2026

క్రిమియా స్వతంత్ర దేశమే


అధికారికంగా ప్రకటించిన రష్యా
మండిపడ్డ అమెరికా
ఆంక్షలు ప్రకటించిన ఒబామా
కెయివ్‌, మార్చి 18 (జనంసాక్షి) :
క్రిమియా స్వతంత్ర దేశమేనని రష్యా అధికారికంగా ప్రకటించింది. ఉక్రెయిన్‌ నుంచి విడిపోతున్నట్టు ప్రకటించిన క్రిమియా స్వతంత్ర, సార్వభౌమ దేశంగా గుర్తిస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్‌ పుతిన్‌ మంగళవారం ప్రకటించారు. ఉక్రెయిన్‌ నుంచి విడిపోవాలని క్రిమియాలోనే 97 శాతం ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. తాము ఆదివారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఈమేరకు ఆదేశ ప్రజలు ఓటు వేశారని చెప్పారు. ప్రజల మద్దతుతో క్రిమియా స్వతంత్ర దేశంగా ప్రకటించుకుందని, రష్యా సమాఖ్యలో తమను చేర్చుకోవాలంటూ విజ్ఞప్తి చేసిందని తెలిపారు. కాగా ఉక్రెయిన్‌ నుంచి విడిపోతున్న క్రిమియాకు అండగా నిలిచిన రష్యాపై పశ్చిమ దేశాలు పలు ఆంక్షలు విధించాయి. క్రిమియా సంక్షోభంలో భాగస్వాములైన ఉక్రెయిన్‌ అధికారులు, రష్యా ఆస్తులను స్తంభింపజేస్తామని యురోపియన్‌ యూనియన్‌ హెచ్చరించింది. ఉక్రెయిన్‌ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానుకోకుంటే మరిన్ని ఆంక్షలు తప్పవని అమెరికా అధినేత బరాక్‌ ఒబామా హెచ్చరించారు. ఇలాంటి బెదిరింపులకు తాము లొంగేది లేదని పుతిన్‌ దీటుగా సమాధానమిచ్చారు. కాగా తమ దేశం నుంచి క్రిమియా వేర్పాటుకు దోహదపడ్డ రష్యా నుంచి తన రాయబారులను ఉక్రెయిన్‌ వెనక్కి పిలిపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *