Tuesday, 3 November 2026

నేను బీసీని కాబట్టే కేసీఆర్‌ విమర్శిస్తుండు


టీ పీసీసీ చీఫ్‌ పొన్నాల
తెలంగాణ మేనిఫెస్టోలో అమరుల కుటుంబాలకు పెద్దపీట : శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, మార్చి 21 (జనంసాక్షి) :
తాను బీసీని కాబట్టే టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నాడని టీ పీసీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తామే సాధించామన్న అహంకారంతో కేసీఆర్‌ వ్యవ హరిస్తున్నారని పొన్నాల విమర్శించారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్‌కు బలహీన వర్గాల వారన్నా, ప్రజలన్నా ఏమాత్రం గిట్టదని అన్నారు. బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని కాబట్టే తనను కెసిఆర్‌ తీసిపారేసి మాట్లాడుతున్నాడని విమర్శించారు. కేసీఆర్‌ దురంహకార వైఖరికి ఆయన చేస్తున్న వ్యాఖ్యలే నిదర్శనమని అన్నారు. టిఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు ఎంపీలతో తెలంగాణ వచ్చిందని భ్రమపడితే పొరపాటని అన్నారు. సోనియా దయవల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను నిలబెట్టుకోలేని పరిస్థితిలో నిరాస నిస్పృహలకు లోనై కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారన్న కేసీఆర్‌ వ్యాఖ్యలు ఏమయ్యాయని అన్నారు. కేసీఆర్‌ వంటి నమ్మద్రోహి మరెవ్వరూ లేరని అన్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. తాము తోడేళ్లలా వ్యవహరిస్తున్నామని కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తోడేళ్లే పులులై విజృంభిస్తాయని అన్నారు. అంతకుముందు గాంధీ భవన్‌లో పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ మేనిఫెస్టోలో పెట్టాల్సిన అంశాలపై చర్చించింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అమలు చేయదగ్గ వాటినే మేనిఫెస్టోలో పెడుతామని కమిటీ సభ్యులు తెలిపారు. అమరవీరుల కుటుంబాలతో పాటు తెలంగాణకు ఏం కావాలో వాటికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై ఐదు కమిటీలు వేయాలని సభ్యులు నిర్ణయించారు. వివిధ అంశాలపై పొన్నాల, శ్రీధర్‌ బాబు, ఉత్తమ్‌లు చర్చించారు. స్థానిక ఎన్నికల్లో తెరాసకు అభ్యర్థులు కూడా దొరకరని కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పొత్తులపై చర్చించేందుకు శుక్రవారం ఉదయం కాంగ్రెస్‌ తెలంగాణ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ భేటీ అయ్యారు. 22 అసెంబ్లీ, 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేయాలనుకుంటున్నామని, అదే జాబితా పొన్నాలకు కూడా ఇచ్చామని చెప్పారు. ఇదిలావుంటే తెలంగాణ పిసిసి చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిలు ఢిల్లీకి రావాలని కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి పిలుపొచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రతిపాదనలతో రావాలని కోరినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ స్క్రీనింగ్‌ కమిటీ సమావేశానికి హాజరు కానున్నారు. రాష్ట్రంలో జరగుతున్న పరిస్థితులను పరిశీలిస్తే టిఆర్‌ ఎస్‌ తో కాంగ్రెస్‌ కు పొత్తులు లేవని తేలిపోయనట్లు తెలుస్తోంది. సిపిఐతో పొత్తుల విషయంలో యోచిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు వీరు ఉదయం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఇదిలావుంటే కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం గాంధీభవన్‌ వద్ద అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం నిరసన తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల బి- ఫారాలు తనకు ఇవ్వడం లేదని అబ్రహాం ఆవేదన వ్యక్తంచేశారు. దళిత ఎమ్మెల్యే అయిన తనపై వివక్ష చూపుతున్నారని, ఇదేనా సామాజిక న్యాయమని ఆయన ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *