రెండు హైకోర్టులు, జలాల, ఉద్యోగుల పంపిణీ
జూన్ 2నాటికి పూర్తి : జైరామ్ రమేశ్
న్యూఢిల్లీ, మార్చి 21 (జనంసాక్షి) :
అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఎంపిక కోసం ఐదుగురు సభ్యులతో నిపుణుల కమిటీ వేయనున్నట్టు జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ తెలిపారు. ఈ కమిటీ సీమాంధ్ర రాజధానిని గుర్తిస్తుందన్నారు. శుక్రవారం జీవోఎం భేటీ జరిగింది. భేటీ ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజనపై కేంద్రం తీసుకున్న చర్యలను ఇప్పటివరకు జీవోఎం సమీక్షించిందని వెల్లడించారు. జూన్ 2లోగా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. విభజన కోసం 19 కమిటీల ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఉద్యోగుల కేటాయింపుల కోసం రెండు కమిటీలు వేశామన్నారు. మార్చి 31లోగా కమిటీలు నివేదిక అందజేస్తాయని అన్నారు. కృష్ణా, గోదావరి నదుల నిర్వహణకు వేర్వేరుగా సర్వోన్నత మండళ్లను రేపు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈ రెండు రాష్ట్రాల కృష్టా నది పంపకాలను బ్రజేష్ కుమార్ కమిటీ చూస్తుందన్నారు. ఏపీ రాజధాని కోసం ప్రణాళిక సంఘంలో ప్రత్యేక విభాగం ఏర్పాటయిందని జైరాం రమేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్రీనివాస్ రాజధాని సెల్ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. త్వరలో మరోసారి జీవోఎం భేటీ కానుంది. జూన్ 2వ తేదీ నాటికి అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని జైరామ్ రమేష్ అన్నారు. వచ్చే వారం జివోఎం మరోసారి భేటీ అవుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే చేపడుతుందన్నారు. జూన్ 2 నుంచి రెండు రాష్టాల్రు అధికారికంగా ఏర్పడతాయన్నారు. ఆలోగా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. విద్య, విద్యుత్, నీరు మొదలైన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం 19 కమిటీలను ఏర్పాటు చేసిందని తెలిపారు. అన్ని కమిటీలు ఈ నెలఖరులోగా తమ నివేదికలు అందజేస్తాయని వెల్లడించారు.
అవశేష ఆంధ్రప్రదేశ్ రాజధానికి నిపుణుల కమిటీ





