Tuesday, 3 November 2026

మరిన్ని త్యాగాలు చేయమంటావా?


త్యాగాలగడ్డ కర్నూల్‌
సీమాంధ్రను సింగపూర్‌ చేస్తా : బాబు
కర్నూల్‌ , మార్చి 21 (జనంసాక్షి) :
కర్నూల్‌ త్యాగాలగడ్డ అని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఏర్పాటు కోసం తన హోదాను కోల్పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. మళ్లీ కర్నూల్‌ త్యాగాలకు సిద్ధపడాలనే అర్థం ధ్వనించేలా చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలుగుజాతిని విచ్ఛిన్నం చేసిన కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు తరిమికొట్టాలని చంద్రబాబు పిలుపుని చ్చారు. శుక్రవారం మాజీ మంత్రి తోటనర్సింహ తన అనుచరులు చంద్రబాబు సమక్షంలో టీడీప ీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లా డుతూ రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉన్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ప్రజల మనోభావాలను కాంగ్రెస్‌ పార్టీ పట్టించు కోలేదని అవినీతి కుంభకోణాలతో ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడి ప్రజలను నట్టేట ముంచిందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన అంశాన్ని కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకోవాలని చూస్తున్నదని ఆయన ఆరోపించారు. తెలంగాణలోనూ కాంగ్రెస్‌ పార్టీ దెబ్బతినడం తథ్యమన్నారు. విచ్ఛిన్నం అయిన తెలుగుజాతిని ఐక్యంగా ఉంచే శక్తి ఒక్క టీడీపీకే ఉందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీతోనే బడుగు బలహీనవర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని బీసీ వ్యక్తిని చేస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నానని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి దళిత ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్‌ ఇప్పుడు ఎందుకు నోరు మెదపడంలేదని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్‌కు విశిష్ట స్థానం దక్కిందని అన్నారు. తనకు గతంలో ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా తెలుగుజాతికి న్యాయం చేయాలని, తాను ఆ పదవిని అంగీకరించలేదన్నారు. సీమాంధ్రను అభివృద్ధి చేసే శక్తి ఒక్క టీడీపీకే ఉందన్నారు. జగన్‌ పార్టీ ఒక జైలు పార్టీ అని చంద్రబాబు విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *