Monday, 2 November 2026

రెండోట్లు మాకే


ఎంపీ, ఎమ్మెల్యేలను గెలిపించండి
మోడీ ట్రాప్‌లో తెలంగాణ
బిడ్డలు పడొద్దు : కేసీఆర్‌
హైదరాబాద్‌, మార్చి 24 (జనంసాక్షి) :
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే రెండు ఓట్లు తమ పార్టీకే వేయాలని టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్ర శేఖర్‌రావు కోరారు. కొత్త రాష్ట్రం.. కొత్త పంథా.. కొత్త అభివృద్ధితో ముందుకు సాగాలని ఆయన ప్రజలకు పిలుపుని చ్చారు. సోమవారం సాయంత్రం నల్గొండ జిల్లా నకిరేకల్‌ ని యోజకవర్గానికి చెందిన పలువురు తెలుగుదేశం నా యకులు, కార్యకర్తలు తెరాసలో చేరారు. అనంతరం కేసీఆర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌, టీడీపీ పాలనను చూశామని, కొత్తగా వారు చేసేదేమీ లేదని, మళ్లీ జెండాలను పట్టుకుని ప్రజల్లోకి వస్తున్నారని, వారిని నమ్మితే నట్టేట
మునుగుతామని కెసిఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ అమలు చేయలేని పథకాలను తెలంగాణా రాష్ట్రంలో అమలు చేసి చూపుతామని ఆయన హామీ ఇచ్చారు. బలహీనవర్గాలు, దళితులు, మైనారిటీలు ఆత్మగౌరవంతో బతకాల్సిన అవసరం ఉందని, అందుకోసం పంది గుడిసెల్లాంటి ఇళ్ల అవసరం లేదని, మూడు లక్షల రూపాయలతో అన్ని వసతలతో కూడిన పక్కా ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు. గ్రామాల్లో భూమి లేని పేదలను గుర్తించి వారికి భూమిని కొనివ్వడంతో పాటు సంవత్సరానికి సరిపోను పెట్టుబడి, సాగునీటి సౌకర్యం, చదును చేసేందుకు ఆర్థిక సాయం ఉచితంగా అందజేయనున్నట్టు తెలిపారు. ప్రాజెక్టుల పనితీరును చూస్తున్నామని, ఎస్‌ఎల్‌బిసి ద్వారా నీళ్లు చేరడం నల్గొండ జిల్లా ప్రజలకు కష్టంగా ఉందని, తెలంగాణా వచ్చాక నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని, కుర్చీ వేసుకుని కూర్చునైనా నీళ్లను పారిస్తానని, ఇది కెసిఆర్‌ మాటగా ఆయన చెప్పుకొచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్య అధికంగా ఉందని, వెంటనే ఆ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోకపోతే ప్రజలంతా అంగవికలురుగా మారుతారని నాలుగేళ్ల కిందటే నివేదిక ఇచ్చినా.. వలస పాలకులు పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. వాళ్లు చస్తే.. మనకేమిటి అన్న రీతిలో వ్యవహరించారని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలో అన్ని గ్రామాలకు కృష్ణా నదీ జలాలను అందిస్తామని అన్నారు. తెలంగాణలో అక్రమంగా పనిచేస్తున్న ఉద్యోగులను మాత్రమే ఆ రాష్ట్ర ప్రభుత్వంలోకి వెళ్లమంటున్నామని, సీమాంధ్రులందర్నీ వెళ్ల మన్నట్టుగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సీమాంధ్ర ఉద్యోగులంతా ఇక్కడే ఉంటే తెలంగాణ సాధించింది దేనికని.. ఎందుకని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్ర ఉద్యోగులు వారి రాష్ట్రానికి వెళితే.. ఇక్కడ ఏర్పడే ఖాళీలలో తెలంగాణ యువకులకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకు తాయన్న ఆశతోనే మాట్లాడుతున్నానే తప్ప తనకు వ్యక్తిగతంగా ఎవరిపైనా కోపం లేదన్నారు. తెలంగాణను బంగారు తెలంగాణాగా మార్చడమే తన లక్ష్యమని అన్నారు. మన తెలంగాణాను.. మనమే పరిపాలించుకునే రీతిలో ఏకపక్షంగా తెరాసాను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేకు కారు గుర్తుకు.. ఎంపీికి మోడీకి ఓటు వేస్తామన్న ఆలోచన విరమించుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. 17కు 17 ఎంపీ సీట్లను గెలుచుకుంటే ఢిల్లీని శాసించి కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి కావాల్సిన నిధులను సాధించుకోవచ్చని అన్నారు. మోడీలు.. గీడీలు… మనకు అక్కర్లేదని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో మెజారిటీ సాధించడం ద్వారానే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పిలుపునిచ్చారు. నకిరేకల్‌ నియోజకవర్గంలో వీరేశంను గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని అన్నారు. వాస్తవంగా వీరేశం టిక్కెట్‌ అడగలేదని, తానే ఆయన పోరాట స్ఫూర్తి చూసి పోటీ చేయాలని ఆహ్వానించినట్టు తెలిపారు. వీరేశంకు ఓటు వేస్తే కేసీఆర్‌కు వేసినట్టేనని, ఈ విషయాన్ని గమనించి నియోజకవర్గంలో ప్రజలందరికీ ఈ సంకేతాలను పంపాలన్నారు. తెరాసా గెలుపులో మహిళలు కీలక భూమిక పోషించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పార్టీ అధ్యక్షుడు బండారు నరేందర్‌రెడ్డి, పొలిట్‌ బ్యూరో సభ్యుడు గుంతకల్ల జగదీశ్వర్‌రెడ్డి, వీరేశం, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *