రిజిస్ట్రార్‌ను ప్రశ్నించిన అధికారులు
భారీ స్కామ్ జరిగినట్లు అనుమానం?
హైదరాబాద్, మార్చి 25 (జనంసాక్షి) :
పీజీ మెడికల్ ఎంట్రన్స్ స్కామ్‌పై సీఐడీ విచారణ ప్రారంభించింది. అలాగే మెడికల్ పీజీ ప్రవేశ పరీక్షలకు సంబంధించి విద్యార్థులెవరికీ అన్యాయం జరగనివ్వబోమని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ రవిరాజు పేర్కొన్నారు. వచ్చే ఏడాదినుంచి ఆన్‌లైన్ ద్వారా పరీక్ష నిర్వహి స్తామని ఆయన తెలిపారు. మూడు రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని గవర్నర్ ఆదేశించారని, అవకతవకలుంటే ప్రభుత్వం చర్యలు తీసుకుం టుందని ఆయన తెలిపారు. మెడికల్ పీజీ ప్రవేశ పరీక్షల్లో వందలోపు టాప్ ర్యాంకు లు వచ్చిన కొంతమందిపై సీఐడీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నా రు. వీరి గురించి ఆరాతీసే పనిలో పడ్డారు. ఈ ప్రవేశ పరీక్షల్లో అక్రమాల పై దర్యాప్తు ప్రారంభించిన సీఐడీ పోలీసులు 24 మంది అభ్యర్థుల ర్యాంకు లు, హాల్ టికెట్లు, ఫోన్ నంబర్లు, మెయిల్ ఐడీలు సేకరించి విచారణ జరుపుతున్నట్లు సమాచారం. మొత్తంగా ఈ వ్యవహారం అంతా కోట్లలో నడిచినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ మెడికల్ పీజీ ఎంట్రన్స్ అవకతవకలపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. ఈ అక్రమాల్లో సుమారు వందకోట్లు స్కాం జరిగిందని ప్రాథమిక అంచనా వేశారు. బెంగళూరులో ప్రశ్నా పత్రాలను ముద్రించిన ప్రింటింగ్ ప్రెస్ యాజమాన్యం నిందితులతో కలిసి కుమ్మక్కయ్యారని అనుమానించిన అధికారులకు తగిన ఆధారాలు అభించాయని సమాచారం.ఈ స్కామ్‌కు సంబంధించి 26 మంది నింది తులను గుర్తించిన సీఐడీ అధికారులు వారిని అదుపులోకి
తీసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. మెత్తం ఆరు బృందాలుగా సీఐడీ అధికారులు రంగంలోకి దిగారు. బెంగళూరులోని వేర్వేరు ప్రాంతాల్లో రెండు బృందాలుగా దర్యాప్తు ప్రారంభించగా, హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడలో సోదాలు నిర్వహించి అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మెడిసిన్‌లో ఫెయిల్ అయనప్పటికీ విజయవాడలో ప్రస్తుతం ర్యాంకుల సాధించిన ఇద్దరి విద్యార్థులను విచారించి, వారి ట్రాక్ రికార్డును పరిశీలించారు. దీని ఆధారంగా కూపీ లాగడంతో డొంక కదిలిందని తెలుస్తోంది. విజయవాడ నుంచి పరీక్షల నిర్వాహకుల ఆధ్వర్యంలో ప్రశ్నా పత్రాలను సిద్ధం చేసిన తరువాత పెన్‌డ్రైవ్‌లో బెంగళూరు నుంచి ప్రిటింగ్ ప్రెస్‌కు తరలించిన సమయంలో ప్రధాన అనుమానితుడు జగదీష్ రెడ్డి ప్రశ్నాపత్రాలను స్వాధీనం చేసుకుని వాటిని దాదాపు 200 మంది విద్యార్థులకు అందించారని అధికారులు భావించి, ఒక్కొక్కరి దగ్గర సమారు రూ. 50 నుంచి రూ. 60 లక్షలు వసూలు చేసినట్లు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసుకు సంబందించి 26 మంది అనుమానితులను గుర్తించి, వారిపై 120(బి), 420 సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీఐడీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ మెడికల్ పీజీ ఎంట్రన్స్ అవకతవకలపై తనకెలాంటి సంబంధం లేదని రిజిస్ట్రార్ బాబూలాల్ వెల్లడించారు. మోసం జరిగిందా లేదా అనేది సీఐడీనే నిర్ధారించాలని ఆయన అన్నారు. సీఐడీ అధికారులు అడిగిన సమాచారాన్ని అందజేశామని బాబూలాల్ పేర్కొన్నారు. వారు అడిగిన వివరాలు తెలిపామన్నారు.
మరోవైపు పీజీ వైద్య విద్య ప్రవేశ పరీక్షలో జరిగిన అక్రమాలపై సీఐడీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. అక్రమాలపై దర్యాప్తునకు సీఐడీ పలు బృందాలను ఏర్పాటు చేసింది. పీజీ మెడికల్ ప్రవేశ పరీక్షలో అవకతవకలపై రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు మంగళవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసు విచారణకు సీఐడీ ఆరు ప్రత్యేక విచారణ బృందాలను రంగంలోకి దించింది. వివిధ ప్రాంతాల్లో, కోణాల్లో ఆరా తీసేందుకు విజయవాడ, గుంటూరు, విశాఖ, హైదరాబాద్, బెంగళూరుకు ప్రత్యేక బృందాలు బయల్దేరి వెళ్లాయి.రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పీజీ మెడికల్ ఎంట్రెన్స్ పరీక్షల్లో అవకతవకలపై రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేసింది. చీటింగ్, కుట్రపూరితమైన అవకతవకలు, అవినీతికి పాల్పడ్డ నేరాలపై కేసు నమోదు చేశారు. నాలుగు బృందాలుగా ఏర్పడ్డ సీఐడీ అధికారులు గుంటూరు, విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్‌లలో ఈ రోజు తెల్లవారు జామునుంచి సోదాలు నిర్వహించారు. ఈ కేసులో సీబీఐ అధికారుల నివేదిక అనంతరం పీజీ ఎంట్రెన్స్ రద్దు చేయాలా లేక తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని హెల్త్ యూనివర్సీటీ అధికారులతో పాటు ఇతర ఉన్నతాధికారులను గవర్నర్ ఆదేశించిన విషయం తెలిసిందే.మెడికల్ పిజి ప్రశ్నాపత్నం లీకేజీ కేసులో విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో విస్తృత తనిఖీలు నిర్వహించిన సిఐడి అధికారులు యూనివర్సిటీ రిజిస్ట్రార్ బాబూలాల్‌తో సహా పరీక్షల నియంత్రణ అధికారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని హైదరాబాద్ కు తరలించి సమగ్ర విచారణ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో ప్రైవేటు మెడికల్ కాలేజీల పాత్రపైనా సీఐడీ అధికారులు దృష్టి సారించారు. మెడికల్ పీజీ కౌన్సెలింగ్ నిర్వహణ, జారీ చేసిన సర్టిఫికెట్లను ఇప్పటికే పరిశీలించిన అధికారులు ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు. కాగా గవర్నర్ ఆదేశాల నేపథ్యంలో సీఐడీ అధికారులు హుటాహుటిన రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కాగా సీబీసీఐడీ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో కౌన్సెలింగ్ ప్రారంభం కానున్న ఏప్రిల్ 15లోగా విచారణ పూర్తిచేసి నివేదిక ఇస్తారా? కౌన్సెలింగ్‌ను వాయిదా పడుతుందా? అన్నది తేలాల్సి ఉంది. ఇంటర్, టెన్త్ క్లాస్‌లో తక్కువ మార్కులు వచ్చి ఎంబీబీఎస్‌లో ఫెయిల్ అయి ప్రస్తుతం ర్యాంకులు వచ్చిన విద్యార్థుల ట్రాక్ రికార్డును అధికారులు పరిశీలించారు. ఈ కేసులో ఎనిమిది మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్న సీఐడీ అధికారులు వీరిలో ఇద్దరు విద్యార్థులను గుంటూరులో పూర్తిస్థాయిలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి వచ్చిన సీఐడీ ఉన్నతాధికారులు విజయవాడలో మొత్తం కేసు దర్యాప్తు పురోగతిని సవిూక్షిస్తున్నారు. మరోవైపు సిఐడి దర్యాప్తుపై జూనియర్ డాక్టర్లు హర్షం వ్యక్తంచేశారు. మెడికల్ పిజి ప్రశ్నాపత్రం లీకేజీ విషయాన్ని మరింత కూలంకషంగా అన్వేషించాలని, తమ భవిష్యత్తుతో ఆడుకున్న నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. మెడికల్ పీజీ అడ్మిషన్లలో జరిగిన అక్రమాలపై సిఐడి అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఆరు బృందాలుగా ఏర్పడిన అధికారులు గత రెండు రోజులుగా వర్సిటీలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. పిజి ప్రవేశ పరీక్షతో పాటు, వర్సిటీలో జరిగిన పలు అక్రమాలపై అన్ని కోణాలలో సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అధికారులు మంగళవారం వర్సిటీ రిజిస్ట్రార్ బాబూలాల్ వాంగ్మూలం తీసుకుకున్నారు. మెడికల్ పిజి కౌన్సిలింగ్ నిర్వహణ, జారీ చేసిన సర్టిఫికేట్లను ఇప్పటికే పరిశీలించిన అధికారులు ఈ కేసులో పురోగతిని సాధించినట్లు తెలుస్తోంది. వైద్య విద్య పీజీ కోర్సుల ప్రవేశ పరీక్షల్లో అక్రమాలపై ప్రాథమిక దర్యాప్తు చేశామని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి ఇప్పటికే తెలిపారు. ఓఎంఆర్ షీట్లలో ఎలాంటి అవకతవకలు జరగలేదని దర్యాప్తులో తెలిసిందన్నారు. 2013 బ్యాచ్ కు చెందిన 11 మందికి ఉత్తమ ర్యాంకులు వచ్చినందున అనుమానం బలపడిందని, ఉత్తమ ర్యాంకులు వచ్చిన 11 మందిలో 8 మంది గుంటూరు వాసులని తెలిపారు. ఈ 11 మందికి మన రాష్ట్రంలో సీట్లు రాక ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఎంబీబీఎస్ చేశారని చెప్పారు. ఆ దిశగా తాము దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.





