
కోట్లల్లో చేతులు మారాయి
హైదరాబాద్, మార్చి 26 (జనంసాక్షి) :పీజీ మెడికల్ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం ముద్రణ సమయంలోనే లీకైనట్లు సీఐడీ అనుమానం వ్యక్తం చేసిం ది. ఈ వ్యవహారంలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్లుగా అధికారులు సందేహిస్తున్నారు. పీజీ మెడికల్ ఎంట్రన్స్‌లో జరిగిన అక్రమాలపై సీఐడీ చీఫ్ టి. కృష్ణప్రసాద్ బుధవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు నివేదిక సమర్పిం చారు. తాము 16 మంది విద్యార్థులను అదుపులోకి విచారించినట్లు చెప్పారు. వారు చెప్పిన వివరాల ఆధారంగా ప్రశ్నపత్రాలు ప్రింట్ చేసిన మంగళూర్ నుంచి లీక్ అయినట్లు తెలుస్తోందని అన్నారు. ఆ ప్రింటింగ్ ప్రెస్ యజమాని, ఒక ప్రొఫెసర్ కూతురుని కూడా సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మెడికల్ పీజీ ప్రవేశ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు జూనియర్ డాక్టర్లు గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంతో
దీనిపై విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి చైర్మన్‌గా విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఓఎంఆర్ షీట్లోగాని, పరీక్షల కేంద్రాల్లో గాని ఎలాంటి అవకతవకలు జరుగలేదని కమిటీ తేల్చింది. పరీక్షకు ముందే పేపర్ లీక్ అయినట్లు అనుమాలు వ్యక్తం చేశారు. వేణుగోపాల్‌రెడ్డి నివేదిక ఆధారంగా గవర్నర్ సీఐడీ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆరు బృందాలుగా విడిపోయిన సీఐడీ అధికారులు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్, యునివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి. విజయ్‌కుమార్‌లను సుదీర్ఘంగా విచారించిన సీఐడీ అధికారులు తమ నివేదికను గవర్నర్‌కు అందజేశారు. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయంలో జరిగిన మెడికల్ పీజీ ఎంట్రెన్స్ స్కాంలో గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురు విద్యార్థినులు, ఇద్దరు విద్యార్థులను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించారు. వారికి సంబంధించిన టెన్త్, ఇంటర్ మార్కులతోపాటు విద్యార్థుల ట్రాక్ రికార్డ్ మొత్తాన్ని సేకరించారు. వీళ్లలో కొంత మంది ఎంబీబీఎస్ తప్పినా, పీజీ మెడికల్ ఎంట్రన్స్‌లో స్టేట్ ర్యాంక్ రావడంపై సీఐడీ అధికారులు దృష్టి పెట్టారు.
సీఐడీ అనుమానం




