
భివాని, మార్చి 28 (జనంసాక్షి) :
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. శుక్రవారం హర్యానాలోని భివానిలో గల చర్ఖీదాద్రీ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కేజ్రీవాల్ మెడపై గుర్తు తెలియని వ్యక్తి కొట్టాడు. దీంతో ఆగ్రహించిన ఆప్ కార్యకర్తలు దాడికి పాల్పడిన వ్యక్తికి దేహశుద్ధి చేశారు. ఈ దాడిపై కేజ్రీవాల్ స్పందిస్తూ తన మెడపై ఎవరో గట్టిగా కొట్టారని, ఇలాంటి హింసాత్మక ప్రతిస్పందనలను తాను ముందే ఊహించానని తెలిపారు. వారి నిజ స్వరూపాన్ని, నిస్పృహను ఈ దాడి వ్యక్తం చేస్తోందని పేర్కొన్నారు. తనపై దాడితో ప్రతిచర్యగా తమ పార్టీ కార్యకర్తలు అతడిపై దాడికి పాల్పడ్డారని, ఇలాంటి ప్రతిదాడులు చాలా తప్పని తెలిపారు. ఇలాంటి ఘటనలను తాను సమర్థించబోనని తెలిపారు. తన మద్దతుదారుల తీరు తనను మనోవేధనకు గురిచేసిందని అన్నారు. హింసాత్మకంగా స్పందిస్తే ఎదుది వారికి, ఆప్‌కు మధ్య తేడా ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. ఎవరూ హింసకు పాల్పడవద్దని తమ పార్టీ కార్యకర్తలను కోరుతామన్నారు.
కేజ్రీవాల్‌పై భౌతికదాడి




