Monday, 2 November 2026

అధికారమివ్వండి.. రైతులకు


లక్షలోపు రుణాలు మాఫీ చేస్తా
నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ తెరిపిస్తా
అందరికీ ఉచిత విద్యనందిస్తా
కేసీఆర్‌ శపథం
నిజామాబాద్‌, మార్చి 28 (జనంసాక్షి) :
అధికారమిస్తే రైతులకు లక్షలోపు రుణాలను మాఫీ చేస్తానని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. శుక్రవారం నిజామాబాద్‌ జిల్లాలోని మోతె గ్రామంలో కేసీఆర్‌ ముడుపు విప్పి మొక్కు చెల్లించుకున్నారు. మోతె గ్రామానికి శుక్రవారం
ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చిన ఆయన 14 ఏళ్ల క్రితం అక్కడినుంచి ముడుపు కట్టి తీసుకువచ్చిన మట్టిని తీసుకెళ్లి మళ్లీ మోతె గ్రామంలో కలిపారు. పిడికెడు మట్టి చేతబట్టి మూటగట్టి తీసుకువెళ్లిన కేసీఆర్‌ ఆ మట్టిని తిరిగి గ్రామంలో కలిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గద్దెలో పెట్టి ప్రత్యేక పూజలు జరిపించారు. గద్దెను పూర్తిగా నిర్మించి కేసీఆర్‌ శపథం చేసి తెచ్చిన మట్టికి స్ఫూర్తి చిహ్నంగా నిలుపుతారు. ఈ సందర్భంగా మోతె గ్రామం తన గుండెల్లో ఉందని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఉద్వేగ పూరితంగా ప్రసంగించారు. రైతులకు టీఆర్‌ఎస్‌ అండగా నిలుస్తుందని, లక్ష రుణమాఫీ చేస్తామన్నారు. మోతె కేసీఆర్‌ గుండెల్లో ఉందని, మోతె గ్రామానికి గోదావరి నీళ్లు వచ్చి తీరుతాయని హామీనిచ్చారు. వందశాతం నీళ్లు తెచ్చి మోతె గ్రామాన్ని సస్యశ్యామలం చేస్తమని భరోసా ఇచ్చారు. నీళ్లు రావాలి. పొలాలు పచ్చగా ఉండాలన్నారు. రైతులకు రూ. లక్ష వరకు రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. రుణమాఫీ ప్రకటించిన విధంగా అమలు చేస్తామన్నారు. సంవత్సరానికి 12వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామన్నారు. నిజాం షుగర్‌ ప్యాక్టరీని నాశనం చేశారని, ఆస్తులు పప్పు బెల్లాలకు పంచినట్లు పంచారన్నారు. ఇప్పుడు సమయం వచ్చిందని, దానిని పునరుద్దరించి చెరకు పంట కళకళలాడిస్తామన్నారు. చెరకు పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మోతె గ్రామంలో అన్ని సౌకర్యాలతో ఇళ్లు కట్టిస్తామని, పునాదిరాయి వేసేందుకు మళ్లీ వస్తానని ఆయన హావిూ ఇచ్చారు. మోతెలో పసుపు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసి, ఎర్రజొన్న బకాయిలను కూడా ఇప్పిస్తానని తెలిపారు. తెలంగాణ సాధించామని సంతోషపడితే సరికాదని అంటూ అందుకు అనుగుణంగా అభివృద్ది చేసుకునేందుకు తనకు అండగా నిలవాలన్నారు. తెలంగాణ కోసం పగలూ రాత్రీ ఉద్యమం చేశామని, చావుకు వెరవకుండా దీక్ష చేశానని, తాను దీక్ష చేసినప్పుడు కాంగ్రెస్‌ నేతలు పదవులు అనుభవిస్తున్నారని కేసీఆర్‌ పేర్కొన్నారు. మోతె గ్రామాన్ని బంగారు తునకలా మారుస్తానన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం 14 ఏళ్ల క్రితం కట్టిన ముడుపును విప్పిన అనంతరం ఆయన సభా వేదికపై మాట్లాడుతూ మోతె గ్రామస్థులు నాకు కొండంత అండనిచ్చారని గుర్తు చేసుకున్నారు. ముత్యం వంటి మోతె గ్రామానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అని తెలిపారు. తెలంగాణ సాధించుకొని రా అని నాకు బొట్లు పెట్టి దీవెనలు అందించిన మోతె గ్రామ అమ్మలకు, అక్కలకు కృతజఙతలు తెలిపారు. తెలంగాణ పోరాటంలో భయమైన ప్రతీసారి మోతె మూటను చూసుకొని ముందుకు నడిచానని అన్నారు. పోరాటంలో బలమైన శత్రువున్నప్పటికీ నన్ను ధైర్యంగా ముందుకు నడిపించింది మోతె గడ్డ అని స్మరించుకున్నారు. విద్యార్థులందరికి ఇంగ్లీషు విూడియంలో ఉచిత నిర్భంద విద్యను అందిస్తామని చెప్పారు. అన్ని పాఠశాలల్లో ఒకే సిలబస్‌తో కామన్‌ స్కూళ్లు పెట్టి, ప్రభుత్వం తన ఖర్చుతో నడిపిస్తారని అన్నారు. 10 ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో ఈ స్కూల్లు కట్టిస్తామన్నారు. మండలానికి ఐదు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇక వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రం కోసం 14 ఏళ్ల క్రితం కట్టిన ముడుపును విప్పడానికి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నిజామాబాద్‌ జిల్లాలోని మోతె గ్రామానికి శుక్రవారం చేరుకున్నారు. గ్రామస్తులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకొని బోనాలు, బతుకమ్మలతో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ముడుపును నెత్తిన పెట్టుకొని సభావేదికపైకి వెళ్లిన కేసీఆర్‌ అర్చకుల మంత్రోచ్చరణల మధ్య ముడుపును విప్పారు. మోతె తెలంగాణవాదానికి స్ఫూర్తినిచ్చిన గ్రామం. అప్పుడే మొగ్గతొడగిన టీఆర్‌ఎస్‌ పార్టీని భుజాన వేసుకున్న ఆ ఊరు మరెన్నో పల్లెలకు ఆదర్శంగా నిలిచింది. ఆ గ్రామాభివృద్ది కమిటీ తీసుకున్న నిర్ణయం అనేక పల్లెలను ఆలోచింపచేసింది. తెలంగాణవాదులను ఆశ్చర్యానికి గురి చేసింది. గ్రామాల అభివృద్ధి కోసమే కాదు ఆత్మ గౌరవం కోసం ఐక్యమవుదామని నినదించిన మోతె ప్రజల స్ఫూర్తికి గులాబీ బాస్‌ సలాం చేశారు. తెలంగాణ పది జిల్లాలకు సందేశాన్నిచ్చిన మోతె గ్రామం ఎంపీటీసీ, సర్పంచ్‌ పదవులతో పాటు జడ్పీటీసీకి సైతం ఏకగ్రీవంగా మద్దతునిచ్చి టీఆర్‌ఎస్‌ను అక్కున చేర్చుకుంది. ఈ స్ఫూర్తి కామారెడ్డి డివిజన్‌లోని మాచారెడ్డి ప్రజలు చాటి 14 ఎంపీటీసీ స్థానాలను, జెడ్పీటీసీని ఏకగ్రీవంగా ఎన్నుకొని రాష్ట్రంలోనే చరిత్ర సష్టించారు. అలాంటి స్ఫూర్తిని రగిలించిన మోతెను సందర్శించాలన్న కోరికతో గులాబీ దళపతి కేసీఆర్‌ 4మే 2001న గ్రామానికి వచ్చారు. గ్రామాభివృద్ది కమిటీ ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసీఆర్‌ను ఆహ్వానించింది. ఆ గ్రామ ప్రజల ఆత్మ గౌరవాన్ని, ఐక్యత రాగాన్ని చూసి ఆశ్చర్యపడ్డ కేసీఆర్‌కు ఎంతో స్థైర్యాన్ని కలిగించింది. గ్రామ కూడలి వద్ద మట్టి చేతబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఇదే మట్టితో తిరిగి వస్తానని శపథం చేసిన కేసీఆర్‌…నేడు మూటగట్టిన అదే మట్టిని పట్టువస్త్రాల్లో పదిలపరిచి మోతె గ్రామానికి తీసుకువచ్చారు. మోతె గ్రామ గడ్డపై పవిత్రమైన మట్టిని చేతుల్లో తీసుకున్న కేసీఆర్‌ గ్రామస్థుల సాక్షిగా ప్రమాణం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలు పణంగా పెట్టి అయినా తెలంగాణ రాష్టాన్న్రి సాధిస్తానని శపథం చేశారు. మోతె మట్టి స్ఫూర్తిగా తిరిగి తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెడతానని భీష్మ ప్రతిజ్ఞ చేశారు. అన్నట్లుగానే పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందాక మోతె గ్రామానికి శుక్రవారం వచ్చారు. మోతె గ్రామ ప్రజల సమక్షంలో శపథాన్ని పూర్తి చేసుకున్న కేసీఆర్‌ తెలంగాణ సాధకునిగా తలెత్తుకొని ఆత్మ గౌరవంతో గ్రామానికి వచ్చారు. ఇందుకు గ్రామస్థులు అభినందించారు. మాజీమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు పలవురు టిఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *