Monday, 2 November 2026

జాబితా సిద్ధం


ఒంటరిపోరైనా ఓడిపోం

గెలుపు గుర్రాలు, సీపీఐ పొత్తుపై దిగ్విజయ్‌ సమాలోచనలు

న్యూఢిల్లీ, మార్చి 29 (జనంసాక్షి) :తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థుల జాబితా సిద్ధమైంది. ఈ విషమయాన్ని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ ధ్రువీకరించారు. జాబితాను త్వరలోనే ప్రకటి స్తామన్నారు. అయితే అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ఖరారు చేయాల్సి ఉందన్నారు. ఒకటి, రెండు రోజుల్లో కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ మరోసారి సమావేశమవుతుందని పేర్కొన్నారు. త్వరలో ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికను పూర్తి చేస్తామని వెల్లడించారు. సీపీఐతో సీట్ల పంపకంపై ఓ నిర్ణయం వెలువరిస్తామని తెలిపారు. తెలంగాణలో సీపీఐతో పొత్తులో ఆలోచిస్తున్నామని ఆయన చెప్పారు. పొత్తుల అంశంపై మాట్లాడుతూ పొత్తుపై టీఆర్‌ఎస్‌ ద్వారాలు మూసుకుంటే సంతోషమే అని ప్రకటించారు. పొత్తులపై టీఆర్‌ఎస్‌ తలుపులు మూసుకుపోయినా అది సంతోషకరమేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ శనివారం సమావేశమైంది. ఈ సందర్భంగా దిగ్విజయ్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతుందన్నారు. ఒకటి, రెండు రోజుల్లో మరోసారి సమావేశమై ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేస్తామన్నారు. ఇదిలావుంటే వచ్చే ఎన్నికల్లో టికెట్‌ కోసం కాంగ్రెస్‌లోని ఆశావహులు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. తమకోసం, తమవారి కోసం పైరవీలు ముమ్మరం చేశారు. జాబితా సిద్దం అవుతున్న దశలో ఎవరికి వారు తమవంతుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా సీట్లకోసం తెలంగాణలో పోటీ తీవ్రంగా ఉంది.  మహబూబ్‌నగర్‌, ఖమ్మం, హైదరాబాద్‌, రంగారెడ్డి, కరీంనగర్‌, నల్గొండ, వరంగల్‌ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు ఢిల్లీలో మకాం వేశారు. చివరి యత్నాల్లో భాగంగా ఆశావహులు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ ఇంటికి పదే పదే వెళ్తున్నారు. దీంతో వారందరినీ ఏఐసీసీ కార్యాలయానికి రావాలని ఆయన సూచించారు. ముందుగా స్కీన్రింగ్‌ కమిటీ చైర్మన్‌ వయలార్‌ రవితో సమావేశమైన దిగ్విజయ్‌ ఆ తర్వాత పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసి తెలంగాణ వ్యవహారాలను చర్చించారు. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానంలో బీసీలంతా తన అభ్యర్థిత్వానే కోరుతున్నారని, అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి టిక్కెట్లు ఆశిస్తున్న అందరి మద్దతు తనకుందని మాజీ ఎంపీ విఠల్‌రావు విన్నవించారు. అలాగే ఆలంపూర్‌లో టికెట్‌ ఆశిస్తున్న సంపత్‌కుమార్‌ అభ్యర్థిత్వాన్ని పరిశీలించకుండా మరొకరిని ప్రతిపాదిస్తున్నారని ఫిర్యాదు చేశారు. పార్టీకి కట్టుబడిన వారిని కాకుండా అవకాశవాదులకు ప్రాధాన్యమిస్తున్నారని అక్కడే ఉన్న సంపత్‌కుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌ నుంచి మాజీ ఎంపీ విఠల్‌రావు, డీసీసీ మాజీ అధ్యక్షుడు ముత్యాల ప్రకాశ్‌, డీసీసీ ఉపాధ్యక్షుడు సంజీవ్‌ ముదిరాజ్‌, జడ్చర్ల స్థానం కోసం రమేశ్‌రెడ్డి, షాద్‌నగర్‌ సీటు కోరుతున్న వీర్లపల్లి శంకర్‌, కల్వకుర్తి ఆశావహుడు చిత్తరంజన్‌దాస్‌, కొడంగల్‌ కోసం సలీం, కొల్లాపూర్‌ నుంచి పోటీచేయదలిచిన రేవతీగౌడ్‌, ఆలంపూర్‌ టికెట్‌ కోరుతున్న సంపత్‌కుమార్‌ తదితరులు ఈ సందర్భంగా పలు అంశాలను దిగ్విజయ్‌ దృష్టికి తీసుకొచ్చారు. అభ్యర్థుల ఎంపిక పక్రియలో ప్రస్తుతం పరిగణనలోకి తీసుకుంటున్న అంశాలపై అభ్యంతరం వ్యక్తంచేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో పలువురి అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయని వస్తున్న వార్తలు ఆవేదన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. అయితే అందరినీ ఆయన మెల్లగా ఒప్పించి పంపుతున్నారు. ఇక నాగర్‌కర్నూలు పరిధిలో ఒక్క సీటును కూడా బీసీలకు కేటాయించడం లేదని ఓబీసీ సెల్‌ చైర్మన్‌ చిత్తరంజన్‌దాస్‌ తెలిపారు. అన్ని అంశాలనూ పరిశీలిస్తానని వారికి దిగ్విజయ్‌ హావిూ ఇచ్చారు. ‘దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నవారిని, ఉద్యమ సమయంలో పార్టీ ఉనికిని కాపాడిన వారిని, నిజమైన కార్యకర్తలను పట్టించుకోండి’ అని హైదరాబాద్‌ పరిధిలో టికెట్‌ ఆశిస్తున్న మరో నేత విజ్ఞప్తిచేశారు. మహేశ్వరం, ముషీరాబాద్‌, సికింద్రాబాద్‌, ఉప్పల్‌, మునుగోడు తదితర నియోజకవర్గాల నుంచి కూడా పలువురు ఆశావహులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మాజీ మంత్రులు చంద్రశేఖర్‌, విజయరామారావు తదితరులు ఈ సమావేశం చివరలో వచ్చినా ఏవిూ మాట్లాడలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *