Monday, 2 November 2026

కాంగ్రెస్‌ గూటికి ఇబ్రహీం

తెరాసలో మైనార్టీలకు న్యాయం జరుగదు : ఇబ్రహీం

కాంగ్రెస్‌తోనే సామాజిక తెలంగాణ : పొన్నాల

మోసం నయవంచనకు మారుపేరు కేసీఆర్‌ : దామోదర

హైదరాబాద్‌, మార్చి 29 (జనంసాక్షి) :టీఆర్‌ఎస్‌ మాజీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఇబ్రహీం కాంగ్రెస్‌ గూటికి చేరారు. ఆయనకు టీ పీసీసీ అధ్యక్షుడు పొ న్నాల లక్ష్మయ్య కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెరాసలో మైనార్టీలకు న్యాయం జరుగదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రెండు ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓడిపోయిన మైనార్టీ నాయకుడ్నైన తనను తప్పించి మరొకరికి అక్కడ అవకాశం కల్పించారని తెలిపారు. టీఆర్‌ఎస్‌లో మైనార్టీలకు స్థానం లేకుండా పోయిందని, డబ్బున్నవారికే కేసీఆర్‌ టికెట్లు ఇస్తున్నారని ఇబ్రహీం అన్నారు. కేసీఆర్‌కు ప్రజలే సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమ పార్టీ అని కేసీఆర్‌ మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ఇచ్చి కాంగ్రెసు న్యాయం చేసిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ, కాంగ్రెస్‌ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని తెలిపారు.  బడుగు బలహీన వర్గాల అభివృద్ధి తమతోనే సాధ్యమని  తెలిపారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ కొత్తగా చెప్పేదేవిూ లేదన్నారు. ఈ వర్గాలకు అనాదిగా అండగా నిలిచిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్‌ మాత్రమేనని అన్నారు. ఈ వర్గాలకు ఎన్నికల్లో తగిన ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఇందులో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. సాధారణ ఎన్నికల్లో తమకు టికెట్లు కేటాయించాలంటూ గాంధీభవన్‌ వద్ద పలువురు ఆందోళనకు దిగారు. బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించాలని, ఐఎన్‌టీయూసీ నేతలకు అవకాశం ఇవ్వాలని ఇలా వివిధ వర్గాల వారు గాంధీభవన్‌ వద్ద ఆందోళన చేశారు. పొత్తులో భాగంగా దేవరకొండ సీటును సీపీఐకి కేటాయించవద్దని ఆనియోజకవర్గ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో ఓ వైపు చర్చలు జరుగుతుంటే మరోవైపు కార్యకర్తలు ఆందోళకు దిగారు. శనివారం ఉదయం గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు భేటీ అవగా, ఇందిరాభవన్‌లో ఏపీసీసీ నేతలు భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా టెకెట్ల కోసం గాంధీభవన్‌ వెలుపల టి.కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఐఎన్‌టీయూసీ నేత జితేందర్‌కు టికెట్టు ఇవ్వాలని అనుచరులు ఆందోళనకు దిగగా, దేవరకొండ సీటును సీపీఐకు ఇవ్వొద్దని గిరిజనులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో గాంధీభవన్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇందిరాభవన్‌లో జరుగుతున్న ఏపీసీసీ సమావేశంలో రఘువీరం, చిరంజీవి, బొత్స, ఆనం, కేవీపీ, డొక్కా హాజరయ్యారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్ల ఖరారుపై ఈ సమావేశం జరుగుతున్న తెలుస్తోంది. అటు గాంధీభవన్‌లో తెలంగాణ ప్రచార కమిటీ భేటీ అయింది. టీపీసీసీ చీఫ్‌ పొన్నాల, దామోదర తదితరులు హాజరయ్యారు. ఎన్నికల ప్రచారంపై వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసందర్భంగా పొన్నాల లక్ష్మయ్య ఆందోళనకారులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారకమిటీ అధ్యక్షుడు దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, వంచన, మోసానికి కేసీఆర్‌ చిరునామా అని, విశ్వాసఘాతుకానికి పర్యాయపదం కేసీఆర్‌ అని  తీవ్రంగా మండిసపడ్డారు. ప్రచార కమిటీ సమావేశం అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ హావిూలపై దళితులు, మైనారిటీలు ప్రశ్నిస్తున్నారన్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారని, కానీ తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఏర్పాటవుతుందని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో సోనియా, రాహుల్‌ పాల్గొంటారని దామోదర చెప్పారు. సికింద్రాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, మెదక్‌, ఆదిలాబాద్‌, నల్గొండ లేదా ఖమ్మంలో ఈ సభలు జరుగుతాయన్నారు. ఈ ఎన్నికలు నమ్మకం, నమ్మకద్రోహం మధ్య పోరాటమని, తెలంగాణలో దొరలకు, దళితులకు మధ్య ఎప్పుడూ పోరాటమేనని దామోదర రాజనర్సింహ అన్నారు. తొలుత సోనియా దేవతని, పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని ప్రకటించిన కెసిఆర్‌ ఇప్పుడు మాటమార్చి పునర్నిర్మాణం అంటున్నారని విమర్శించారు. దళిత ముఖ్యమంత్రి, మైనార్టీ ఉపముఖ్యమంత్రి వంటి ఎన్నో ప్రకటనలు చేసి మాటమార్చి అధికారం కోసం వెంపర్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్‌ వంచన, మోసానికి మారుపేరని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు హావిూని నెరవేర్చిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విశ్వసనీయతకు మారుపేరుగా నిలవగా, టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని మాటతప్పిన కేసీఆర్‌ విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని రాజనర్సింహ అన్నారు. సోనియాది మానవత్వమైతే, కేసీఆర్‌ది దానవత్వమని విమర్శించారు. దళితులకు సీఎం పదవి, మైనార్టీలకు డెప్యూటీ సీఎం పదవి ఇస్తామన్న హావిూలు ఏమయ్యాయని కేసీఆర్‌ను ప్రజలు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు వద్దని, హైకమాండ్‌ నిర్ణయానికి కట్టుబడతామని దామోదర అన్నారు. తెలంగాణలో త్వరలో ఆరు జిల్లాల్లో రాహుల్‌, సోనియా గాంధీల సభలు నిర్వహిస్తామని, త్వరలోనే తేదీలను ప్రకటిస్తామని చెప్పారు. సీమాంధ్రలో నష్టపోయినా కాంగ్రెసు తెలంగాణ ఇచ్చిందని ఆయన చెప్పారు. సోనియా తన కడుపు కోసుకుని తెలంగాణ ఇచ్చారన్నారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు వద్దని, వ్యక్తిగతంగా తెరాసతో పొత్తుకు తాను వ్యతిరేకమని, అయితే పొత్తు విషయంలో అధిష్టానం నిర్ణయమే తమ నిర్ణయమని ఆయన అన్నారు. తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెసుపార్టీయే అనే నినాదంతో బస్సు యాత్రలు ఉంటాయని ఆయన చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *