పొత్తు లేకపోతే నేనుండలేను
కాంగ్రెస్‌లో చేరేందుకు మంతనాలు
న్యూఢిల్లీ, మార్చి 29 (జనంసాక్షి) :
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తీరుపై ఆ పార్టీ ఎంపీ వివేక్ అసహనంతో ఉన్నారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ఎంపీ వివేక్ మళ్లీ సొంత గూటికి చేరబోతున్నారు. ఢిల్లీలో మకాం వేసిన వివేక్ బ్రదర్స్ తో దిగ్విజయ్ సింగ్ చర్చించారని సమాచారం. తిరిగి కాంగ్రెస్‌లోకి రావాలని కోరినట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా ఆయన టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ కథనాలను వివేక్ ఖండించారు కూడా. ఈ మేరకు ఆయన టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను కలిసి వివరణ కూడా ఇచ్చారు. కాగా శుక్రవారం వివేక్ మరోసారి కేసీఆర్‌తో ఆయన ఫామ్హౌస్లో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో శనివారం వివేక్ ఢిల్లీలో ప్రత్యక్షం అవటం ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారనే ఊహాగా నాలకు బలం చేకూరుతోంది. వివేక్ కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారాన్ని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ కూడా ఖండించకపోవటం విశేషం. ఎంపీ వివేక్, రాజ్యసభ మాజీ సభ్యుడు కె కేశవరావు, నాగర్ కర్నూల్ ఎంపీ మందా జగన్నాథంలు కాంగ్రెస్ పార్టీని వీడి గతేడాది జూన్ 2న టీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే అప్పట్నుంచే వివేక్ పార్టీ వ్యవహారాల్లో అంటీ ముట్టనట్టు ఉంటూ వస్తున్నారు. ఈ మధ్య ఆయన పార్టీ వీడి కాంగ్రెస్ లో చేరతారని ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో వివేక్ తనంతట తానుగా వెళ్లి కెసిఆర్‌ను కలిసి తన వాదన వినిపించారు. ఇదిలావుంటే ఆయన కాంగ్రెస్‌తో పొత్తులు కోరుకుంటున్నారని సమాచారం. వివిధ అంశాలపైనా ఆయన దిగ్విజయ్‌తో చర్చించి పార్టీలో పునరాగమనానికి నిర్ణయించారని తెలుస్తోంది.





