Monday, 2 November 2026

మాది పేదల పార్టీ


మోడీది కార్పొ’రేట్‌’ పార్టీ
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌
పాట్నా, ఏప్రిల్‌ 1 (జనంసాక్షి) :తమది పేదల పార్టీ అని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిది కార్పొరేట్‌ పార్టీ అని ఆయనకు పేదల గోడు ఎప్పటికీ పట్టదని ఆయన తేల్చిచెప్పారు. బీజేపీ వెలిగిపోతోందంటూ గతంలో ప్రచారం చేసినప్పుడు ఎదురైన చేదు అ నుభవమే మరోమారు ఎదుర్కోక తప్పదని రాహుల్‌ అన్నారు. బీజేపీ ప్రచార బుడగ పేలిపోక తప్పదన్నారు. అబద్దాలను ప్రచారం చేస్తూ గుజరాత్‌ తరహా అభివృద్ది అంటూ ఊదరగొడుతున్నారని మండిపడ్డారు. దేశమంతటా నరేం ద్రమోడీ ప్రభంజనం వీస్తోందంటూ బిజెపి సారథ్యంలోని ఎన్డీయే చేస్తున్న ప్రచారంలో అణువంతినా వాస్తవం లేదని రాహుల్‌గాంధీ విమర్శించారు. ప్రజలకు వాస్తవంగా చేసేదేవిూ లేకపోయినా
అబద్దాలు, అర్థసత్యాలతో వారిని వంచించడంలో భాజపా ‘మార్కెటింగ్‌ నిపుణులు, ప్రచారకర్తలు’ ఆరితేరారని వ్యాఖ్యానించారు. బీహార్‌లోని ఔరంగాబాద్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ ఎన్డీయేతోపాటు బీహార్‌లో నితీశ్‌కుమార్‌ నేతృత్వంలోని జేడీ (యూ) ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించారు. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎన్డీయే ‘భారత్‌ వెలిగిపోతోందం’టూ చేసిన ప్రచారం, జరిపిన ప్రచారార్భాటం గాలిబుడగలాగా పేలిపోయాయని పేర్కొన్న రాహుల్‌ ఆ చేదు అనుభవంతో ఇప్పుడు భాజపా తన ప్రచార వ్యూహాన్ని కొద్దిగా మార్చి, ‘గుజరాత్‌ తరహా అభివృద్ధి’ పేరిట నానా హడావిడి చేస్తోందన్నారు. అయితే గతంలో మాదిరిగానే త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ దేశప్రజలు దానిని తిరస్కరించి, బిజెపికి గట్టి గుణపాఠం చెప్పడం తథ్యమన్నారు. ఎన్డీయే వైఫల్యాలు, లోపాలను ఇప్పటికే ప్రత్యక్షంగా చూసిన ప్రజలు మరోసారి తప్పటడుగు వేసి, దానికి అధికారం ఇవ్వబోరన్నారు. కాగా ఒక మోస్తరుగా మాత్రమే ప్రజలు హాజరైన ఈ బహిరంగసభకు రాహుల్‌ దాదాపు గంటకుపైగా ఆలస్యంగా వచ్చారు. ఆయన ప్రయాణించాల్సిన హెలిక్టాపర్‌లో సాంకేతికలోపం తలెత్తడంతో ఒక దశలో సభ మొత్తానికే రద్దవుతుందేమోనని భావించారు. కానీ ఆయన ఆలస్యంగా సభాస్థలికి చేరుకుని, అప్పటికే తన రాక కోసం అక్కడ వేచి ఉన్న ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *