Tuesday, 3 November 2026

కావూరి బేరగాడే


వ్యాపార ప్రయోజనాల కోసమే రాజీనామా
జైరామ్‌ రమేశ్‌ ఫైర్‌
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 3 (జనంసాక్షి) :కావూరి సాంబశివరావు బేరగాడేనని, తన వ్యాపార ప్రయోజనాల కోసమే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి పార్టీ మారేందుకు సిద్ధమయ్యాడని కేంద్ర మంత్రి జైరామ్‌ రమేశ్‌ ఆరోపించారు. కేంద్ర మంత్రి పదవికి ఏలూరు పార్లమెంట్‌ సభ్యుడు కావూరు సాంబశివరావు రాజీనామా చేయడం కేవలం ఆయన వ్యాపార ప్రయోజనాల కోసమేనని జీవోఎం సభ్యుడు జై రాం రమేష్‌ అన్నారు. కావూరి రాజీనామాపై గురువారం న్యూఢిల్లీలో స్పందించా రు. గత 40 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న కావూరి సాంబశివరావుకు ఓ సిద్ధాంత మంటూ లేదని జై రాం రమేష్‌ ఆరోపించారు. వ్యాపార ప్రయోజనాల కోసమే కావూరి సాంబశివరావు పార్టీ మారుతున్నారని విమర్శించారు. విభజన అంశంపై కేబినెట్లో చర్చ జరుగుతున్నప్పుడు కావూరి ఎప్పుడూ వాకౌట్‌ చేయలేదని జైరామ్‌ రమేశ్‌ గుర్తు చేశారు. సూడాన్లో పవర్‌ ప్రాజెక్ట్‌ కాంట్రాక్ట్‌ తీసుకుని పూర్తి చేయలేక పోయారని విమర్శించారు. దాంతో భారత్‌ ప్రభుత్వానికి కావూరి వల్ల చెడ్డ పేరు వచ్చిందన్నారు. కావూరివల్ల అనేకసార్లు కేంద్రనానికి తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయన్నారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్‌ నుంచి కావూరి ఎంతో మేలు పొందారన్నా రు. పురందేశ్వరి తన మంత్రి పదవికి రాజీనామా చేసిన సమయంలో జైరామ్‌ స్పందిస్తూ దుగరాజు పట్నంలో వేల ఏకరాలు స్థలాలు పురందేశ్వరి కొనుగోలు చేసిందంటూ ఘాటైన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కావూరి సాంబశివరావు కేంద్రమంత్రి పదవికి గురువారం రాజీనామా చేశారు. పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలిపే ఆర్డినెన్స్‌ పక్కన పెట్టడంపై తాను తీవ్రంగా కలత చెందానని ఈ నేపథ్యంలో తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు కావూరి ప్రకటించారు. అయితే తన రాజీనామా లేఖను స్వయంగా
ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు కావూరి అందజేసిన సంగతి తెలిసిందే. కావూరి సాంబశివరావు టీడీపీలో చేరేందుకు సిద్ధపడగా, ఆపార్టీలో తలుపులు మూసుకుపోయాయి. దాంతో ఆయన బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకున్న తర్వాతే రాజీనామా లేఖను సిద్ధం చేసుకున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో జైరాం తీవ్రంగా స్పందించారు. వ్యాపార ప్రయోజనాల కోసమే కావూరి బిజెపి వైపు చూతున్నారని అన్నారు. జైరామ్‌ రమేశ్‌ తనపై చేసిన విమర్శలపై కావూరి సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జైరాం రమేశ్‌ వల్లే కాంగ్రెస్‌కి ఈ దుస్థితి వచ్చిందని ఆయన ఆరోపించారు. సీమాంధ్రలో కాంగ్రెస్‌ ఒక్క పార్లమెంటు స్థానం కూడా గెలవదని, జైరామ్‌ రమేశ్‌కి ప్రాక్టికల్‌ నాలెడ్జి లేదని కావూరి పేర్కొన్నారు. తన రాజీనామాపై జైరాం చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేశాక ఇవన్నీ గుర్తుకు వచ్చాయా అని అన్నారు. దిగ్విజయ్‌ తనని రాజీనామా చేయొద్దన్నారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *