Tuesday, 3 November 2026

దళిత సీఎం హుళక్కే!


మైనార్టీలకు డెప్యూటీ సీఎం

నీటిమూటే

మాట తప్పిన కేసీఆర్‌

మేనిఫెస్టోలో ఊసేలేదు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (జనంసాక్షి) :

ఆరు నూరు కాలేదు. కేసీఆర్‌ మళ్లీ మాట మీద నిలబడలేదు. ఎప్పట్లాగే ఆ యన హామీ గాలిలో దీపమైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి దళితుడినే మొదటి సీఎం చేస్తానని ఎన్నో వేదికలపై నుంచి లక్షలాది మంది ప్రజల సాక్షిగా చెప్పిన కేసీఆర్‌ ఇప్పుడు మాట తప్పారు. ఇన్నాళ్లు తన హామీని వెనక్కు తీసుకున్నానా అంటూ ప్రశ్నించిన గులాబీ బాస్‌ తన ఎన్నికల మేని ఫెస్టో సాక్షిగా దళిత సీఎం హామీని తుంగలో తొక్కారు. అలాగే మైనార్టీని డెప్యూటీ సీఎం చేస్తానన్న హామీని నీటిమూటే అని తేల్చేశారు. శుక్రవారం టీఆర్‌ఎస్‌ ప్రకటించిన మేనిఫెస్టోలో దళిత సీఎం, మైనార్టీ డెప్యూటీ సీఎం హామీలు కనుమరుగయ్యాయి. కేసీఆర్‌ దళిత సీఎం, మైనార్టీలకు డెప్యూటీ ఇస్తామనే అంశాన్ని తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో పర్యాయాలు చెప్పిన విషయాన్ని విస్మరించారు. మేనిఫెస్టోలో ఆయా వర్గాలకు బడ్జెట్‌ కేటాయింపులు, రిజర్వేషన్ల పెంపు, ప్రత్యేక బడ్జెట్‌లాంటి అంశాలను పొందుపరచడం ద్వారా ఆయా వర్గాలకు రాజ్యాధికారం కల్పిస్తామన్న హామీని పూర్తిగా విస్మరించారు. ఇచ్చిన మాటపై కేసీఆర్‌ ఎప్పటికీ నిలబడరు అనే అపవాదును ఆయన అక్షరాల నిజం చేశారు. రాజకీయ ప్రత్యర్థులకే కాదు విభజనను పూర్తిగా వ్యతిరేకించిన సీమాంధ్ర పెత్తందారి శక్తులకు నోరెత్తే అవకాశాన్ని కేసీఆర్‌ కల్పించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ ఎన్నో హామీలు గుప్పించారు. వాటిలో ఎక్కువ అంశాలకు మేనిఫెస్టోలో చోటు కల్పించారు. కానీ ప్రధాన హామీ అయిన దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామనే అంశాన్ని మాత్రం ఉద్దేశపూర్వకంగా పక్కనబెట్టేశారు. ఉద్యమ పార్టీ అధినేతగా తెలంగాణ రాష్ట్రానికే తానే ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నట్టు కేసీఆర్‌ చెప్పకనే చెప్పారు. తమ కుటుంబాన్ని అందలం ఎక్కించేందుకు ఆయన వ్యూహ రచన చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని దళిత, బహుజన, మైనార్టీలు తమ భుజాలకు ఎత్తుకున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన 1200 ఆత్మ బలిదానాల్లో ఈ వర్గాలకు చెందిన యువత, విద్యార్థులే అత్యధికం. ఇంతమంది త్యాగాల వల్ల, ఐక్య ఉద్యమాల వల్ల సిద్ధించిన తెలంగాణను తానే ఏలాలన్న ఏకైక లక్ష్యంతో కేసీఆర్‌ ప్రధాన హామీలను విస్మరించారు. నాయకుడన్నాక ఒకే మట మీద నిలబడాలి. నిలబడగలిగే మాటలు మాత్రమే చెప్పాలి. హామీలు ఇచ్చేప్పుడు ఒకటికి పది సార్లు నెరవేర్చగలమా లేదా అని సమీక్షించుకోవాలి. కానీ కేసీఆర్‌ నోటికి వచ్చినట్టుగా హామీలిస్తూ పోయారు. నిజంగా కేసీఆర్‌ మేనిఫెస్టోల్లో పెట్టిన హామీలన్నీ నెరవేర్చగలరా అన్నది
మరో ప్రశ్న. ఆయన ఏం చేస్తారనే అంశాన్ని పక్కనబెడితే నెరవేర్చగలిగిన దళిత సీఎం, మైనార్టీ డెప్యూటీ సీఎం హామీని మాత్రం పక్కనబెట్టారు. తెలంగాణ సాధన కోసం సాగిన ఉద్యమంలో టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ పాత్రపైనా ఇప్పుడు అనేక ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ సాధన కోసం సాగిన ఐక్య ఉద్యమాలను కేసీఆర్‌ తన క్రెడిట్‌గా చెప్పుకుంటున్నారని, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారని రాజకీయ ప్రత్యర్థులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. కేసీఆర్‌ మేనిఫెస్టో వెలువరించిన మరు క్షణమే దళిత సీఎం, మైనార్టీలకు డెప్యూటీ సీఎం హామీలు ఎమాయ్యాయంటూ ప్రశ్నించడం మొదలు పెట్టారు. రాజకీయ ప్రత్యర్థులకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం కేసీఆర్‌కు లేకపోవచ్చు. కానీ రేపు ప్రజలకు మాత్రం ఆయన సమాధానం చెప్పి తీరాలి. లక్షలాది గొంతులు ఆయన్ను దీనిపై నిలదీయడానికి సిద్ధంగా ఉన్నాయి. తాను ఎందుకు మాట తప్పాడో నేరుగా కేసీఆర్‌ ఎప్పటికీ చెప్పలేరు. ఎందుకంటే ఎదురుదాడి కేసీఆర్‌ నైజం. రాజకీయ ప్రత్యర్థులపై ఎదురుదాడి సత్ఫలితాలు ఇస్తుందేమోకానీ, ప్రజలపై ఎదురుదాడికి దిగితే మాత్రం అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కేసీఆర్‌ ఆచరణ సాధ్యం కాని ఎన్నో హామీలను గుప్పించి చేయగల హామీలను విస్మరించడం ద్వారా తన అసలు స్వరూపాన్ని బయటపెట్టుకున్నాడని ప్రజాస్వామికవాదులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బహుజనులకు రాజ్యాధికారం సిద్ధించడానికి కేసీఆర్‌ వ్యతిరేకి అని కూడా ఆరోపిస్తున్నారు. వీటికి కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ కచ్చితంగా సమాధానం చెప్పుకునే రోజు త్వరలోనే వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *