Tuesday, 3 November 2026

అది ఆయనకు మామూలే


కేసీఆర్‌ మాటమీద ఎన్నడూ లేడు
టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 5 (జనంసాక్షి) :
తెలంగాణ ఉద్యమానికి ముందోమాట, తర్వాత ఓ మాట మాట్లాడడం కేసీఆర్‌కే చెల్లిందని తెలంగాణ టీడీపీ ఎన్నికల కమిటీ అధ్యక్షుడు ఎల్‌.రమణ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్‌ మాట తప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఆ మాటమార్చి తానే ముఖ్యమంత్రి కావాలనే ధోరణితో ఉన్నారని విమర్శించారు. కేసీఆర్‌ ఏనాడూ మాటకు కట్టుబడి ఉండడన్న విషయం మరోమారు స్పష్టమయ్యింది. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌, హైదరాబాద్‌ యూనియన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీట్‌ ద విూడియా కార్యక్రమంలో ఆర్‌. కృష్ణయ్యతో కలిసి హాజరైన రమణ తెలంగాణ పునర్నిర్మాణంలో తమ పార్టీ పాత్రను వివరించారు. బీజేపీతో పొత్తుల వ్యవహారానికి సంబంధించి పలు అంశాలను వెల్లడించిన రమణ మొదటి నుంచి తెలుగుదేశం బడుగు బలహీన వర్గాలకోసం పనిచేస్తుందని, తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి చేసి తీరుతుందని పేర్కొన్నారు. బడుగులకు ఎన్టీఆర్‌ నుంచి టిడిపి ఆదరించిందన్నారు. బిసిలకు టిడిపి తప్ప ఏ పార్టీ కూడా రాజకీయ ప్రయోజనాలను కల్పించలేదన్నారు. ఈ ఎన్నికల్లో బీసీలకు రాజ్యాధికారం కల్పించకుంటే పార్టీలోనే ఉండి పోరాటం చేయనున్నట్లు టిడిపి ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య స్పష్టంచేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బిసిలకు ముఖ్యమంత్రి పదవిని ప్రకటించిన ఘనత టీడీపీదేనన్నారు. బీసీలు ఈ అవకాశాలన్ని వినియోగించుకుంటారని కృష్ణయ్య అన్నారు. గతంలో ఎన్నడు కూడా ఇలాంటి అవకాశం రాలేదని, ఇకముందు కూడా రాదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *