Tuesday, 3 November 2026

అవినీతిపై భాజపాది ద్వంద్వ వైఖరి


సిర్స, ఏప్రిల్‌ 6 (జనంసాక్షి) :

అవినీతిపై భారతీయ జనతా పార్టీది ద్వంద్వ వైఖరి అని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఆదివారం హర్యాణాలోని సిర్సలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన బీజేపీ తీరుపై తీవ్ర స్వరంతో విమర్శలు గుప్పించారు. అవినీతిపై ఇళ్లెక్కి ప్రచారం చేస్తున్న మోడీ తమ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అవినీతి, అక్రమాలపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. అవినీతికి తాము వ్యతిరేకమని, యూపీఏ హయాంలో అక్రమాలకు పాల్పడిన కేంద్ర మంత్రులను సైతం జైలుకు పంపిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ బీజేపీ మాత్రం ఎదుటి వారి అవినీతిపై నోటికొచ్చినట్లు మాట్లాడుతూ తమ వారిని వెనకేసుకొస్తుందని మండిపడ్డారు. బీజేపీ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో మైనింగ్‌ మాఫియా రాజ్యమేలుతుందని, అటువైపు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగాని, మంత్రులు గాని చూసేందుకు కూడా సిద్ధపడటం లేదని అన్నారు. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వమూ అవినీతిని చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం అవినీతిని సహించిన దాఖలాలు లేవన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారిపై విచారణ జరిపి మంత్రులను జైళ్లకు పంపిన విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీ అవినీతిపై మాటలు చెప్పి చూస్తూ ఊరుకుంటుందని తాము మాత్రం చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. బీజేపీ ప్రజల మధ్య విభజన రాజకీయాలను ప్రోత్సహిస్తుందని, విభజన ద్వారా ప్రజల్లో చీలికతెచ్చి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కుట్రలు పన్నుతోందని, దానిపై అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *