Tuesday, 3 November 2026

తెలంగాణ తెచ్చింది మేమే


అభివృద్ధి మేమే చేస్తాం
వెళ్లిన వారంతా మళ్లీ రండి
కాంగ్రెస్‌ ఎంపీల పిలుపు
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 7 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చింది తామేనని, అభివృద్ధి కూడా చేసి చూపిస్తామని టీ కాంగ్రెస్‌ ఎం పీలు అన్నారు. తెలంగాణ సాధన కోసం కాంగ్రెస్‌ను వీడి ఉద్యమ పార్టీలో చేరిన వారంతా మళ్లీ వెనక్కు రావాలంటూ వారు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీతోనే తెలంగాణ
పునర్‌నిర్మాణం సాధ్యమని వారు అన్నారు. కాంగ్రెస్‌ను వీడిన నేతలు తిరిగి పార్టీలో చేరాలని ఎంపీలు ఎంపీ పొన్నం ప్రభాకర్‌, వివేక్‌, మధుయాష్కీ పిలుపునిచ్చారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని బలపరచాలన్నారు. ప్రజలు తెలంగాణ ఓట్లు చీలకుండా కాంగ్రెస్‌కు ఓటేయాలన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే పునర్నిర్మాణం చేసే సత్తా కలిగి ఉందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో తమతో కలసి రావాలన్నారు. అందుకు తాము కలసికట్టుగా పోరాడుతామని తెలిపారు. వివేక్‌ తిరిగి కాంగ్రెస్‌లోకి రావడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. తెలంగాణ తెచ్చింది, ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీనేనని పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాదేనన్నారు. లంకకు వారధి నిర్మించడంలో ఎందరో తమ సాయం అందించినా ఆముడే దానిని నిర్మించారన్నారు. ఉడుత కూడా తనవంతుగా సాయం అందించిందన్నారు. అయితే వారధి నిర్మించింది మాత్రం రాముడని అన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో అనేకులు ఉడతాభక్తిగా సాయం అందించినా దానిని సాకారం చేసిన ఘనత సోనియాదన్నారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్‌ నేతల పాత్ర కీలకమని మధుయాష్కీ అన్నారు. అమరవీరుల త్యాగాలను గుర్తించింది కాంగ్రెస్‌ పార్టీ అని చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని సైతం వ్యతిరేకించి పోరాడామన్నారు. అందరం కలసి పోరాడినా చివరకు ఇచ్చింది మాత్రం సోనియాగాంధీ అన్నారు. తెలంగాణ వ్యతిరేకులకు పార్టీలో చేర్చుకుని టిక్కెట్‌ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని మధుయీష్కీ టిఆర్‌ఎస్‌ను ప్రశ్నించారు. కాంగ్రెస్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ఎంపీ మధుయాష్కీ అన్నారు. భావి తరాలకు భవిష్యత్తు కావాలంటే కాంగ్రెస్‌ నాయకత్వం ఉండాలన్నారు. తెలంగాణ ఏర్పాటులో ఎంపీల పోరాటం చరిత్రాత్మకం తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా పనిచేశామన్నారు. మహబూబాబాద్‌లో రాళ్లురువ్విని కొండా సురేఖకు టిక్కెట్‌ ఎలా ఇస్తారని అన్నారు. ఇదిలావుంటే తెలంగాణ ఇవ్వడంలో కీలక భూమిక కాంగ్రెస్‌ పోషించిందన్నారు. సోనియా తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతగానే తాను తిరిగి కాంగ్రెస్‌లో చేరానన్నారు. కాంగ్రెస్‌ మాత్రమే తెలంగాణకున్యాయం చేయగలదన్నారు. అందరూ కాంగ్రెస్‌కు అండగా నిలవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *