Tuesday, 3 November 2026

సబితా ఇంద్రారెడ్డి , కృపానందంచుట్టూ ఉచ్చు బిగుస్తోందా….

ఓఎంసీ అక్రమ గనుల కేటాయింపుల కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చుట్టూ ఉచ్చుబిగుస్తోంది.  సీబీఐ సబితతో పాటు ఓఎంసీకి ప్రాథమిక లీజులను మంజూరు చేసిన పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందంనూ నిందితుడిగా చేర్చింది. వీరిద్దరి పాత్రపై నేడు సీబీఐ చార్జీషీట్ ను దాఖలు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

అనంతపురం జిల్లా ఓబుళాపురంలో గనుల లీజులో పాటు అక్రమ తవ్వకాలపై దర్యాప్తు చేసిన సీబీఐ…2011 డిసెంబరు 3న మొదటి ఛార్జీషీట్ దాఖలు చేసింది. తర్వాత ఐఏఎస్ అధికారి, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీలక్ష్మీని నిందితురాలిగా చేర్చుతూ 2012 మార్చి 30న, గాలి జనార్ధన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు మెఫజ్ అలీఖాన్ పాత్రపై గత ఏడాది జనవరి 2న అనుబంధ ఛార్జీషీట్లను దాఖలు చేసింది. తదుపరి దర్యాప్తును కొనసాగించటానికి కోర్టు అనుమతిని కోరింది. ఓబుళాపురం గనుల ద్వారా 4 వేల మూడు వందల 10 కోట్లకు పైగా కొల్లగొట్టిన కేసులో అంతిమ లబ్ధిదారుపై దర్యాప్తు కొనసాగిస్తామని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఈ దర్యాప్తు కొనసాగుతున్నందున గాలి జనార్ధన్ రెడ్డికి బెయిల్ ఇవ్వటంపై సీబీఐ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు నిరాకరణే ఎదురైంది.

బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా రెండు నెలల్లో దర్యాప్తు పూర్తయిందని చెప్పిన సీబీఐ నివేదికను మాత్రం సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్ లో అందజేసింది. కేసు విచారణ ఏప్రిల్ 15కు వాయిదా పడింది. సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలోని అంశాల ఆధారంగా సీబీఐ ఓఎంసీ కేసులో మరో అనుబంధ ఛార్జీషీట్ ను త్వరలో దాఖలు చేయనుంది. దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా గనుల లీజులకు సంబంధించి అనుమతులు మంజూరు చేసిన సబితా ఇంద్రారెడ్డి కీలక పాత్ర పోషించారని సీబీఐ వెల్లడించింది. ఈ కేసులో సబితా, పరిశ్రమల శాఖ మాజీ కార్యదర్శి కృపానందం లపై ఐపీసీ సెక్షన్ 120 బి రెడ్ విత్ 409, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(2) రెడ్ విత్ 13(1) (డి)ని చేర్చినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *